హైదరాబాద్, ఫిబ్రవరి 7 ( నమస్తే తెలంగాణ ) : పెండింగ్ బిల్లుల కోసం ఎన్నిసార్లు వినతులు సమర్పించినా రాష్ట్ర సర్కారు నుంచి సరైన స్పందనలేకపోవడంతో సర్పంచ్ల జేఏసీ ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించి, నిరసనలు తెలిపినా పట్టించుకోకపోవడంతో సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. ఏకంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే ఉద్యమాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. దీనికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ల బిల్లులు చెల్లిస్తామని అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నా సందర్భంగా స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. కానీ గద్దెనెక్కిన తర్వాత ఖజానాలో నిధులు లేవని సాకులు వెతుకుతున్నాడు. గత డిసెంబర్లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనూ త్వరలోనే చెల్లిస్తామని చెప్పిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిర్ణీత గడువు మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌లు బిల్లుల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శికి అనేకసార్లు విన్నవించారు. ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు సైతం సమర్పించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గతేడాది అక్టోబర్ 4న సెక్రటేరియట్ వద్ద నిరసన తెలిపారు. నవంబర్ 10న గన్‌పార్క్ వద్ద సుమారు రెండు వేలమంది మాజీ సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. తాజాగా ఫిబ్రవరి 5న చలో సెక్రటేరియట్ చేపట్టారు.
ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా సర్కారులో చలనం లేకపోవడంతో విసిగివేసారిన సర్పంచ్ల జేఏసీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజక వర్గం నుంచే కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం తీర్మానం చేసి, చలో కొడంగల్‌కు పిలుపునిచ్చారు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామని రాష్ట్ర సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి మాజీ సర్పంచ్‌లు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.