హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గ్రామపంచాయతీల పెండింగ్ బి ల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్చేస్తూ అసెంబ్లీకి బయల్దేరిన మాజీ సర్పంచులను గాంధీభవన్ మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మాజీ సర్పంచులను అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. 2019-24 మధ్యకాలంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి, ఆర్థికంగా కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని, కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పెండింగ్ బిల్లుల అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.