నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో నాలుగోరోజూ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శిలామయ, లోహమయ మూర్తి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకం కార్యక్రమాలు భక్త జన సందోహం మధ్య, వేద మంత్రాల ప్రతిధ్వనులతో వేడుకగా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డీఆర్ అనిల్ కుమార్ దంపతులు యజమానులుగా సంబంధిత హవనాలు రుత్వికుల మార్గనిర్దేశానుసారం ఉదయ సంధ్య వేళల్లో శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. మంగళవారం ఫల, పుష్ప, శయ్య, ధాన్య ధనాధివాసాలను నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర నియమాల అనుసారం సాగిన ఈ వేడుక ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేసింది.
మహిమాన్విత లక్ష్మీ నరసింహ స్వామి మూర్తులకు ప్రాణప్రతిష్ట చేస్తున్న అరుదైన వేడుకలను నిర్వహించిన వారికి, వీక్షించిన వారికి శత్రు,రుణ, రోగ, మృత్యు భయాలు తొలగిపోతాయన్న ప్రధానమైన విశ్వాసాన్ని భక్తులు వ్యక్తపరిచారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా మూర్తులు శక్తివంతమవుతాయని, భక్తజనానికి కల్పతరువుగా ఆలయం వాసికెక్కుతుందని క్రతువు సంయోజకులు, నరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి వివరించారు. ఉగ్రరూపంలో దుష్ట శిక్షణను, లోక రక్షణను అనుగ్రహించే నరసింహ స్వామి శాంతిరూపంలో మానసిక ప్రసన్నతను, అనితరసాధ్యమైన ధైర్యాన్ని ప్రసాదిస్తాడని ఆయన వివరించారు. ప్రజా నాయకురాలిగా లోకకళ్యాణం కోసం కల్వకుంట్ల కవిత పరివారం ఈ మహా క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
నాలుగో రోజు ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్టాపన కార్యక్రమాలు సేవాకాలం, నివేదన మంగళా శాసనాలు, వేద విన్నపాలు, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్నిముఖం, మూల మంత్రమూర్తి మంత్ర హవనం, పంచ సూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్య పూర్ణాహుతి, శాత్తుమోరై కార్యక్రమాలు భక్త జన రంజకంగా జరిగాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం తో ప్రారంభమైన సాయంకాల కార్యక్రమాలు ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. నరసింహ ఉపాసకుల మంగళా శాసనాలు, తీర్థ ప్రసాద గోష్ఠితో నాలుగో రోజు కార్యక్రమాలు సంపన్నమయ్యాయి.
ప్రముఖుల రాకతో సందడి..
నాలుగో రోజు నరసింహ స్వామి ఆలయంలో ప్రముఖుల రాకతో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆర్మూర్ శాసనసభ్యుడు, పీయూసీ చైర్మన్ ఆశన్న గారి జీవన్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్, డీఆర్డీఏ పీడీ చందర్ నాయక్, తెలంగాణ విశ్వవిద్యాలయ0 వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవికుమార్, తదితరులు హాజరయ్యారు.