న్యూఢిల్లీ: సర్వికల్ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్ నిర్మూలన కోసం హ్యూమన్ పపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ) నిరోధక టీకాలు వేయవలసి ఉంటుంది. వీటిని కేవలం బాలికలకు మాత్రమే కాకుండా బాలురకు కూడా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ వైరస్‌ను హెచ్‌పీవీ అని పిలుస్తారు. ఇది లైంగిక చర్యల ద్వారా సంక్రమించే సుఖ వ్యాధి. దీని నిరోధానికి ప్రస్తుతం కేవలం బాలికలకు మాత్రమే టీకాలు ఇస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఎటువంటి లక్షణాలను చూపకుండా ఉండగలదు. 90 శాతం కేసుల్లో ఇది సహజంగానే రెండేండ్లలో పరిష్కారమవుతుంది. అయితే, ఈ వైరస్ కొనసాగడం వల్ల కొందరిలో క్యాన్సర్ వ్యాధికి దారి తీస్తుంది. మహిళలకు సోకే క్యాన్సర్లలో హెచ్‌పీవీ వల్ల వచ్చే సర్వికల్ క్యాన్సర్ నాలుగోది. ఏటా 6.60 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, 3.50 లక్షల మంది మరణిస్తున్నారు. హెచ్‌పీవీ టీకాలను ప్రస్తుతం 147 దేశాల్లో సిఫారసు చేస్తున్నారు. కానీ హెచ్‌పీవీ వల్ల వచ్చే సర్వికల్ క్యాన్సర్‌ను నిర్మూలించడానికి తగిన వ్యూహం ఏమిటో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉందని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయన నివేదిక ప్రధాన రచయిత సోయంగ్ పార్క్ (మేరీలాండ్ విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ, టీకాల ద్వారా సమర్థంగా నిరోధించగలిగే కొన్ని క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ ఒకటి అని చెప్పారు.