హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీముబారక్ (Shaadi Mubarak) చెక్కులతో పాటు లబ్ధిదారులకు ఇకపై సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీజీజీ(సెంటర్ గుడ్ గవర్నెన్స్)లో మార్పులు చేసి, వాట్సాప్ ద్వారా సందేశం కూడా పంపాలని ఆదేశాలివ్వడంతో అధికారులు ఆమేరకు చర్యలు చేపట్టారు. నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచేందుకు గత బీఆర్ఎస్ సర్కారు కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టి రూ.లక్షా నూట పదహారు రూపాయలు అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ అమలుచేయకపోతే ఇప్పుడు కొత్తగా లబ్ధిదారుకు చెక్కుతో పాటు సర్టిఫికెట్ ఇవ్వాలని యోచిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కేవలం ప్రచారం కోసం తప్ప మరేమీ కాదని అధికారులే చెబుతుండడం గమనార్హం.
ఇప్పటికే వేలల్లో దరఖాస్తులు పెండింగ్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన మందకొడిగా కొనసాగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలకు ఈ పథకాలను అమలు చేస్తుండగా బీసీ సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. ఇక నిరుపేద ఆడబిడ్డలు పథకానికి శుభలేఖ, లేదంటే మ్యారేజ్ సర్టిఫికెట్తో ఆన్లైన్లో సీజీజీ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులను మండల రెవెన్యూ అధికారులు ఆమోదం తెలిపి రెవెన్యూ డివిజనల్ అధికారులకు పంపాల్సి ఉంటుంది. వారు ఆమోదం తెలిపి, బిల్లు శాంక్షన్ కోసం పై అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లబ్ధిదారుల పేరిట చెక్కులు జారీ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలోనే మందకొడిగా కొనసాగుతున్నది. గతేడాది దరఖాస్తులే 49వేలు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరం లక్షా 9వేల దరఖాస్తులు రాగా, వెరిఫికేషన్ పూర్తయినవి 29,500 మాత్రమే. మొత్తం ఇప్పటివరకు వచ్చిన లక్షా 58వేల దరఖాస్తుల్లో 55,500 ఎమ్మార్వో కార్యాలయాల్లోనే పెండింగ్లో ఉన్నాయి. 29వేల దరఖాస్తులకు పరిశీలన పూర్తయినా ఆర్డీవో స్థాయిల్లోనే పెండింగ్లో ఉన్నాయి.