మిషన్ భగీరథ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ మోదీ సర్కార్ చేపట్టిన ‘హర్ ఘర్ జల్’కు నిధులు ఆగిపోయాయి. 64 శాతమైనా లక్ష్యాన్ని చేరుకోకముందే.. పథకానికి కేంద్రం నిధులను ఆపేసింది. ఇకపై ఆ పథకం భారం రాష్ర్టాలదేనని తేల్చిచెప్పింది. కేసీఆర్ హయాంలోనే వందశాతం ఇంటింటికీ నల్లానీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అంటూ ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున్నాయి. దేశవ్యాప్తంగా 2028 నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యమంటూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన హర్ ఘర్ జల్ పథకం (జల్ జీవన్ మిషన్) అందుకు తాజా నిదర్శనం. ఈ పథకం కింద 2026-27 బడ్జెట్లో రాష్ర్టాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇకపై రాష్ర్టాలే నిధులు భరించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు పార్లమెంట్ వేదికగా కేంద్రం నివేదించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు 2019లో హర్ ఘర్ జల్ (జల్‌జీవన్ మిషన్) పథకాన్ని ప్రారంభించింది. 2024 చివరి నాటికి భారతదేశంలోని 19.36 కోట్ల గృహాలన్నింటికీ నల్లా కనెక్షన్లు అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో పథకం అమలు మందకొడిగానే సాగుతూ వచ్చింది.
దీంతో పథకం పూర్తి చేసే లక్ష్యాన్ని 2028 డిసెంబర్ వరకు కేంద్రం పొడిగించింది. ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యంలో 15.59 కోట్ల ఇండ్లకే (81.56%) నల్లా కనెక్షన్లు ఇచ్చింది. ఇందులో పథకం ప్రారంభం నాటికే దేశంలో మొత్తంగా 16.72% (3.23 కోట్లు) గృహాలకు వివిధ రూపాల్లో నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే, కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టిన తరువాత కొత్తగా 12.55 కోట్ల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఇచ్చింది. నికరంగా జలజీవన్ మిషన్ పథకం ప్రగతి 64.87 శాతమే. జాతీయ సగటు, మిషన్‌లో చిన్న రాష్ర్టాలను మినహాయిస్తే, పథకం వాస్తవ ప్రగతి 50% కూడా లేదని గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 8 రాష్ర్టాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 100% కనెక్షన్ల లక్ష్యం పూర్తయింది. తెలంగాణ, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, అండమాన్ నికోబార్, డయ్యూ డామన్, పుదుచ్చేరి రాష్ర్టాలే లక్ష్యాన్ని పూర్తి చేశాయి.
పథకం గడువును డిసెంబర్ 2028 వరకు పొడిగించారు. నిర్దేశిత లక్ష్యంలో ఇంకా 6.81 కోట్ల గృహాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉన్నది. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందుగానే చేతులెత్తేసింది. పథకానికి గత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల కేటాయింపు నిలిపేసింది. పథకం కింద చేపట్టిన పెండింగ్ పనులను రాష్ట్రాలే సొంత నిధులతో పూర్తి చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు జల్‌శక్తి శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. పథకం కోసం 2025-26లో ఏ రాష్ట్రానికీ/కేంద్రపాలిత ప్రాంతానికీ నిధులను కేటాయించలేదని జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి సోమన్న పేర్కొన్నారు. అంతేకాదు, నీరు రాష్ట్ర జాబితాలోని అంశమని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను రాష్ర్టాలే తమ సొంత వనరుల నుంచి సమకూర్చుకోవాలని సూచించామని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి ప్రకటనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఏ రాష్ట్రానికీ నిధులు కేటాయించలేదని స్పష్టంగా తెలిసిపోతున్నది. 2025-26లో పథకానికి రూ.66,770 కోట్లు ప్రతిపాదించినా, సవరించిన బడ్జెట్ కేటాయింపులు రూ.16,944 కోట్లకే పరిమితమయ్యాయి. మొత్తంగా 74% తక్కువ. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ కోసం రూ.67,363 కోట్లు కేటాయించినట్టు మాత్రమే ప్రకటించింది. అయితే, ప్రస్తుత కేటాయింపులు జీతాలు, నిర్వహణ తదితర రెవెన్యూ వ్యయాల కోసమేనని, పనుల కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని స్పష్టమవుతున్నది. కేంద్రమంత్రి ప్రకటన సైతం అదే విషయాన్ని రూఢీ చేస్తున్నది. మొత్తంగా పథకం లక్ష్యాన్ని చేరుకోకముందే కేంద్రం చేతులెత్తేసింది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కన్నా ముందుగానే ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. కేవలం మూడేండ్లలోనే పనులు పూర్తి చేసింది. 2019 సంవత్సరం ప్రారంభం నాటికే ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడం ప్రారంభించింది. అప్పటికీ కేంద్రం జలజీవన్ మిషన్‌ను ప్రారంభించనేలేదు. మిషన్ భగీరథ పథకానికి ఎక్కడా, ఏ కాలంలోనూ నీటి కొరత లేకుండా చేసేందుకు పక్కా ప్రణాళికతో కేసీఆర్ సర్కార్ బహుముఖ చర్యలు చేపట్టింది. విజయవంతంగా నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసింది. 100% నల్లా కనెక్షన్ల ద్వారా శుద్ధమైన నీటిని అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కానీ మోదీ సర్కార్ మాత్రం లక్ష్యం చేరుకోకముందే చేతులెత్తేసింది.
