హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ):మూర్ఖులు తాను కూర్చొన్న చెట్టు కొమ్మ ను తామే నరుక్కుంటారన్నట్టు.. కేంద్రం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి నిధులు సమకూర్చుకోవాలి. ఇలా నిధుల కూర్పు అనేది బడ్జెట్లో భాగం. కేంద్రమైన, రాష్ట్రమైన బడ్జెట్ పెట్టినప్పుడు మార్కెట్ బారోయింగ్స్ అనేది ఒక కాంపోనెంట్గా తీసుకోవాలి. రాష్ర్టాల్లో ఉండే పబ్లిక్ సెక్టార్ యూనిట్లు.. కేంద్రం నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లిస్తుంటాయి. వాటి ని కూడా మేం రాష్ట్ర ప్రభుత్వ అప్పులే అం టాం. అలాగే పరిగణిస్తామని చెప్పి అన్ని ఆంక్షలు పెట్టి ఎఫ్ఆర్బీఎంకు కోతలు విధించారు. నేను ప్రధానిని అడుగుతున్నా.. ఈ విషయం నీతి ఆయోగ్ భేటీలో ఎందుకు చర్చించరు? ఇదేనా టీమిండియా? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? ఎఫ్ఆర్బీఎంకు కోతలతో రాష్ర్టాల అభివృద్ధి కుంటుపడుతది? నేను నీతిఆయోగ్‌కు రాకున్నా ప్రధాని గారిని హైదరాబాద్ నుంచి, దేశం నుంచి అడుగుతున్నా.. దయచేసి ఎఫ్ఆర్బీఎంకు కోతలను విరమించండి.. తద్వారా రాష్ర్టాల అభివృద్ధికి దోహదపడండి. రాష్ర్టాల అభివృద్ధిని కుంటుపరచకండి.. బలమైన రాష్ర్టాలు ఉంటేనే బలమైన భారతదేశం ఉంటది. అదే దేశ సమాఖ్య స్ఫూర్తి.. వీక్ స్టేట్స్ విల్ బీ ఏ వీక్ నేషన్.. స్ట్రాంగ్ స్టేట్స్ విల్ బీ ఏ స్ట్రాంగ్ నేషన్.. దట్ ఇస్ వాట్ ద రియల్ ఫెడరల్ స్ట్రక్చర్. దట్ ఈజ్ వాట్ ద రియల్ ఫెడరల్ స్పిరిట్.. దాన్ని పాటించండి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.
కోర్టుకు పోతామంటే దడుచుకొని రూ.10వేల కోట్లు ఇచ్చారు..
ఎక్కడైనా ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రాస్పెక్టివ్ ఉంటాయి తప్పితే, రెట్రాస్పెక్టివ్ ఉండవని సీఎం అన్నారు. ‘పీఏసీలు తీసుకొన్నవి కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులగానే పరిగణిస్తాం.. అది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌గా పెడుతామని తెలంగాణకు ఇచ్చిన రూ.54 వేల కోట్ల లో రూ.25 వేల కోట్లు కోత విధించారు. అం తకుముందు కరెంట్‌లో ఉదయ్ అనే స్కీమ్ తెచ్చారు. దాని కింద రూ.12 వేల కోట్ల రుణా లు మనం తీసుకొన్నాం. తరువాత ఉదయ్ రుణం మీరే భరించండంటే.. సరే మన కరెం ట్ సంస్థలే కదా అని ఒప్పుకొన్నాం. కానీ దాన్ని కూడా దీని కింద కోత పెట్టారు. నేను మొన్న ఢిల్లీకి పోయినప్పుడు అడిగిన.. ఇస్తారా.. లేక సుప్రీం కోర్టులో కేసు వేయమంటారా అని అడిగిన. సీఎస్, ఫెనాన్స్ సెక్రటరీ ఈ విషయం ఓపెన్‌గా చెప్పినం.. లెటర్ ఇచ్చి నం.. ‘అదర్ వైస్ వీ విల్ రిసార్ట్ టూ లీగల్ రికోర్స్’ (లేకపోతే కోర్టుకుపోతాం) అని చెప్తే, దడుచుకొని రూ.10 వేల కోట్ల కోతను తగ్గించారు. ఇంకా రూ.15 వేల కోట్ల కోత అలాగే ఉన్నది. రూ.53 వేల కోట్లులో ఇప్పుడు 39 వేల కోట్లకు అనుమతి ఇచ్చారు. ఆ రూ.15 వేల కోట్లు కూడా అడుగుతున్నాం’ అన్నారు.
5జీ స్పెక్ట్రమ్ నుంచి ఎలా తప్పించుకొంటరు?
‘2 జీ స్పెక్ట్రమ్ వేలంలో అన్యాయం జరిగినట్టు ఆనాడు మోదీ పెడబొబ్బలు పెట్టారు. ఈ రోజు 5జీ స్పెక్ట్రమ్ ఏమైంది? 5 లక్షల కోట్లకు అంచనాలు వేస్తే లక్షా 50 వేల కోట్లు ఎలా వస్తాయ్? దీని వెనక మతలబు ఏంది? కుంభకోణం ఏంది? ఆ రోజు 2జీ స్పెక్ట్రమ్‌పై పెద్దగా మాట్లాడారు కదా.. ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఇతరులపై నెపం మోపడం, బట్టకాల్చి మీద వేయడం చాలా సులభం. కానీ దీని నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.