హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నదీజలాల వివాదాలు, సమస్యలకు సంబంధించిన అంశాలపై వారంలోగా ఎజెండాను పంపాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణకు సూచించింది. ఆ అంశాలపై చర్చించేందుకు ఎజెండాను ఖరారు చేసి, 2 వారాల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపింది. తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమైంది.
సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ ప్రసాద్ నేతృత్వంలో కొనసాగిన ఈ భేటీలో ఏపీ మరోసారి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కింది. శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పత్తిని నిలిపేయాలని, తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. గోదావరిలో నీటిలభ్యతపై అధ్యయనం చేయించాలన్న డిమాండ్‌ను మరోసారి లేవనెత్తింది. ఈ వాదనలను తెలంగాణ అధికారులు కొట్టిపడేశారు. అనంతరం కేంద్ర కమిటీ ఏపీ ఫిర్యాదులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని అంశాలను పరిశీలించాకే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశామని, నీటిలభ్యతపై అధ్యయనం ఉండబోదని తేల్చిచెప్పింది.