హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లకు కేంద్ర విద్యుత్తు శాఖ ఇటీవల ఏకపక్షంగా ఆదేశాలు జారీచేయడంపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కేంద్ర ప్రభుత్వం హద్దులు మీరుతున్నదని, న్యాయ ప్రక్రియలో అనవసరంగా జోక్యం చేసుకొంటున్నదని మండిపడింది. బకాయిల చెల్లింపునకు సంబంధించిన అంశం కోర్టు పరిశీలనలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీచేయకూడదని స్పష్టం చేసింది.
ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణ డిస్కంలను ఆదేశించడం న్యాయస్థానాన్ని అతిక్రమించడమేనని టీఎస్ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావు పేర్కొన్నారు. కేంద్ర ఆదేశాలపై తగిన చర్య చేపట్టాలని తెలంగాణ డిస్కంలకు సూచించారు.
2014లో ఏపీని పునర్విభజించి తెలంగాణను ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడి డిస్కంలను అక్కడే కొనసాగేందుకు అనుమతించిన విషయం విదితమే. విద్యుత్తు సంస్థలను ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో చేర్చినందున వాటి ఆస్తులు, అప్పులను ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం విభజించాల్సి ఉన్నది. దీనిపై రెండు రాష్ర్టాల మధ్య క్లెయిమ్‌లు, కౌంటర్ క్లెయిమ్‌లు కొనసాగుతుండటంతో ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో చేసిన క్లెయిమ్‌ను అమలుకు వీల్లేనిదిగా ప్రకటించాలని తెలంగాణ డిస్కంలు కోరడంతో తదనుగుణంగా టీఎస్ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్తు చట్టం-2003తోపాటు ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ డిస్కంలు ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్ఈఆర్సీ స్పష్టం చేసింది.
మరోవైపు ఏపీ నుంచి తమకు రావలసిన బకాయిలతోపాటు పెన్షన్ బాండ్లలోని వాటాను, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్)లో తెలంగాణ జెన్కో పెట్టిన పెట్టుబడులను 18% వార్షిక వడ్డీతో చెల్లించేలా ఏపీ జెన్కోను ఆదేశించాలని కూడా తెలంగాణ డిస్కంలు టీఎస్ఈఆర్సీని కోరాయి. ఈ మేరకు తెలంగాణ డిస్కంలు 2018లో దాఖలు చేసిన ఇంటర్‌లాక్యూటరీ అప్లికేషన్‌పై టీఎస్ఈఆర్సీ స్పందిస్తూ.. ఏపీ జెన్కోకు ఓ తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది. ఒరిజినల్ పిటిషన్‌పై తాము నిర్ణయం తీసుకొనే వరకు విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి దుందుడుకు చర్య చేపట్టవద్దని ఆ ఉత్తర్వులో కోరింది. దీనిపై ఆగ్రహం చెందిన ఏపీ జెన్కో.. నాటి ఉమ్మడి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో టీఎస్ఈఆర్సీతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఇంకా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు వెలువడలేదు. ఇంకా ఈ రిట్ పిటిషన్ పెండింగ్‌లోనే ఉన్నది. దీంతో తమకు తెలంగాణ డిస్కంల నుంచి రూ.3,441.78 కోట్ల అసలు, రూ.2,841.90 కోట్ల వడ్డీ కలిపి మొత్తం రూ.6,283.68 కోట్లు రావలసి ఉన్నదని పేర్కొంటూ ఏపీ జెన్కో నిరుడు హైకోర్టులో మరోసారి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బకాయిలను తెలంగాణ డిస్కంలు విడుదల చేయడం లేదని ప్రకటించి తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరిన ఏపీ జెన్కో.. కొన్ని రోజులకే ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకొన్నది.
ఆ తర్వాత తెలంగాణ డిస్కంలు, జెన్కో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్ర విభజన అనంతరం తమకు ఏపీ నుంచి రావలసిన రూ.4,774 కోట్ల బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరాయి. ఈ పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఏపీకి రూ.3,441.78 కోట్ల అసలుతోపాటు ఈ ఏడాది జూలై 31 వరకు రూ.3,315.14 కోట్ల లేట్ పేమెంట్ సర్‌చార్జి కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణ డిస్కంలను ఆదేశించడం న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని టీఎస్ఈఆర్సీ పేర్కొన్నది.