హైదరాబాద్, జూలై 27, (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం లోక్‌సభలో నిస్సిగ్గుగా తేల్చిచెప్పింది. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమంటూ కుంటిసాకు చూపే ప్రయత్నం చేసింది. దీంతో రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేయలేదా? అని తెలంగాణ, ఏపీ సంధించిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పలేకపోయింది. తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సాంకేతికంగా ఎలాంటి అడ్డంకి లేకపోయినా రాజకీయ కోణంలో కేంద్రం తాత్సారం చేస్తున్నది.
నియోజకవర్గాల పునర్విభజనకు సాధారణంగా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తెలుగు రాష్ర్టాలకు ఈ నిబంధన వర్తించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజ్యాంగ సవరణతో ప్రమేయం లేకుండానే తెలుగు రాష్ర్టాల్లో ఈ ప్రక్రియ చేపట్టవచ్చని చెప్తున్నారు. ఈ చట్టం ప్రకారం తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు పెరగాల్సి ఉన్నది. ఈ అంశంపై బుధవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ.. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదని స్పష్టం చేశారు. అసెంబ్లీ స్థానాలు పెంచాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించాల్సి ఉంటుందని చెప్పారు. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తెలిపారు.
2026 దాకా ఆగనక్కర్లేదు
వాస్తవానికి తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు 2026 దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఎప్పుడైనా ఈ ప్రక్రియ చేపట్టేందుకు వీలున్నది. ఉదాహరాణకు ఆర్టికల్ 370 రద్దుతో ఒకే రాష్ట్రం (కేంద్రపాలిత ప్రాంతం)గా ఏర్పడిన జమ్ముకశ్మీర్‌లో కేంద్రం రాజ్యాంగాన్ని సవరించకుండానే నియోజకవర్గాలను పునర్విభజించింది. ఈ ఏడాది మే నెలలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీలో కూడా రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే నియోజకవర్గాలను విభజించవచ్చు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే సాంకేతికంగా 2039 వరకు అవకాశం లేదనే చెప్పాలి. ప్రతి 10 ఏండ్లకు ఓసారి జరిగే జనాభా లెక్కల సేకరణ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా గతంలో కేంద్రం చట్టం చేసింది. తద్వారా 1971 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్ల సంఖ్య 543కు, అన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 3,997కు పెరిగింది. ఆ తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్ల సంఖ్యలో మార్పు లేనప్పటికీ అసెంబ్లీ స్థానాల సంఖ్య మాత్రం 4,123కు చేరింది. తిరిగి 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. కానీ, నియోజకవర్గాల పునర్విభజనకు 2026 వరకు ఆగాల్సిన అవసరం లేదని 84వ రాజ్యాంగ సవరణ చట్టం-2002 కూడా స్పష్టం చేస్తున్నది.
2031లో జనాభా లెక్కల సేకరణ
సాంకేతికంగా చూస్తే 2026 తర్వాత 2031లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఇది జరిగిన నాలుగేండ్ల అనంతరం (2034లో) జనాభా లెక్కలను ప్రచురిస్తారు. ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి లేదా సిట్టింగ్ జడ్జి చైర్మన్‌గా కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ పని పూర్తికావాలంటే 2039 వరకూ ఆగాల్సిందే. ఈ సుదీర్ఘ ప్రక్రియతో సంబంధం లేకుండానే తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాలను పునర్విభజించేందుకు వీలున్నది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఇది సాధ్యమే. కానీ, దక్షిణాది రాష్ర్టాల పట్ల అడుగడుగునా వివక్షతో వ్యవహరిస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఈ ప్రక్రియను మరింత దీర్ఘకాలం సాగదీసే అవకాశం లేకపోలేదు.
జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన
ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రపాలిత ప్రాంతగా మారిన జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయకుడానే సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్ముకశ్మీర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేకే శర్మ సభ్యులుగా ఉన్న ఈ కమిషన్.. 2011 జనభా లెక్కల ప్రకారం ఈ ఏడాది మే 4న జమ్ముకశ్మీర్‌లో 5 పార్లమెంట్ స్థానాలను, 90 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. వీటిలో 43 అసెంబ్లీ నియోజకవర్గాలు జమ్ము రీజియన్‌లో, 47 అసెంబ్లీ నియోజకవర్గాలు కశ్మీర్ లోయలో ఉన్నాయి. వీటిలో 9 నియోజకవర్గాలను (జమ్ము రీజియన్‌లో 6, కశ్మీర్ లోయలో 3) ఎస్టీలకు రిజర్వు చేశారు.
అసెంబ్లీ సీట్ల పెంపులో కేంద్రం ద్వంద్వ వైఖరి
జమ్ముకశ్మీర్‌లో పెంచి మాకు పెంచరా?
బీజేపీ ‘ఒకే దేశం – ఒకే చట్టం’ అంటే ఇదేనా?
ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచిన విధంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాదికి ఒక న్యాయం.. దక్షిణాదికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు బుధవారం లేఖ రాశారు. రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తున్నందున 2026 తర్వాతే ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు గురించి ఆలోచిస్తామని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారని, అలాంటప్పుడు జమ్ముకశ్మీర్‌లో ఎలా పెంచారని నిలదీశారు. జనాభా లెకల సవరణ పదేండ్లకోసారి జరుగుతున్నందున 2031 తర్వాతే తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి మాటల్లో స్పష్టమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఒకే దేశం, ఒకే చట్టం అన్న బీజేపీ నినాదానికి అర్థం ఇదేనా? అని నిలదీశారు. రాజ్యాంగ సవరణ చేయకుండానే జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచారని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా పెంచాలని లేఖలో కోరారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపుకోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.