హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తున్నట్టు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించగా.. తాజాగా కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే 2025-26 సైతం నిర్ధారించింది. రెండేండ్లలో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోయిందని, రెవెన్యూ రాబడి తగ్గిపోయిందని, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని స్పష్టం చేసింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ధ్వంసమై, రైతులు సాగును వదిలి వలసలు వెళ్లిపోగా, పదేండ్ల కేసీఆర్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారింది.
ప్రాజెక్టులు కట్టి నీళ్లు తేవడం, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు వంటి పథకాలతో ఊహించని స్థాయిలో వ్యవసాయరంగం పుంజుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తూ, ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్‌ను పక్కకునెట్టింది. కానీ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తారుమారైందని ఆర్థిక సర్వే గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 2023-24, 2024-25 సంవత్సరాల్లో అత్యధికంగా ధాన్యం పడించిన 8 రాష్ర్టాల వివరాలను నివేదికలో వెల్లడించారు. ఇందులో తెలంగాణ లేకపోవడం గమనార్హం. పంజాబ్, పశ్చిమబెంగాల్, హర్యానా, గుజరాత్ అసోం, ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాలు ఈ జాబితాలో ఉన్నాయి.
రెండేండ్లుగా రైతులు విత్తనాల కొనుగోలు నుంచి పంట అమ్ముకునేదాకా అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. రైతుబంధు సకాలంలో వేయకపోగా, ఒకసారి పూర్తిగా ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు అవస్థ పడ్డారు. ఇక ఎరువుల సంగతి సరేసరి. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా లైన్లలో చెప్పులు, పాస్‌బుక్కులు పెట్టి రోజుల తరబడి ఎరువుల కేంద్రం వద్ద కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. పంట కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి కారణాలతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పడిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు.
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక సర్వే (2025-26) ఆందోళన వ్యక్తంచేసింది. కొవిడ్ అనంతర కాలంలో రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు జీడీపీలో సగటున 2.8 శాతంగా ఉండగా, మూడేండ్లుగా ఇది పెరుగుతూ 3.2 శాతానికి చేరిందని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 19 రాష్ట్రాలు రెవెన్యూ మిగులుతో ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 11కు పడిపోయింది. సుమారు 18 రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇందులో సర్కార్ కూడా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టినా, డిసెంబర్‌నాటికి మైనస్ 9601.02 కోట్లు రెవెన్యూ లోటు నమోదైందని పేర్కొన్నది. ద్రవ్యలోటు 65930.31 కోట్లుగా రికార్డయ్యింది.
కొవిడ్ కారణంగా 2020-21లో మాత్రమే తెలంగాణలో రెవెన్యూ లోటు నమోదైంది. దాదాపు రూ.16వేల కోట్లుగా ఉన్నది. ఆ మరుసటి సంవత్సరమే పుంజుకొని.. సుమారు రూ.6,700 కోట్ల రెవెన్యూ మిగులు నమోదైంది. 2023-24లోనూ రెవెన్యూ మిగులు కనిపించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెవెన్యూ లోటు నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది 12వేల కోట్ల లోటు తప్పదని స్పష్టంచేస్తున్నాయి.
రాష్ట్రంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని ఆర్థిక సర్వే నివేదిక తెలిపింది. వినియోగ ధరల సూచిక (సీపీఐ) ద్రవ్యోల్బణం 2022-23తో పోల్చితే ఈ ఏడాది భారీగా పతనం అయినట్టు నివేదిక వెల్లడించింది. ఇది ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తున్నట్టు సూచిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిరుడు సెప్టెంబర్‌లో రాష్ట్ర ఆర్థికం మరోసారి ‘డిఫ్లేషన్’ దశలోకి వెళ్లింది. రాష్ట్రంలో ప్రతి ద్రవ్యోల్బణం 0.15% నమోదైంది.
ఇందులో గ్రామీణ ప్రతి ద్రవ్యోల్బణం -0.29% ఉండగా.. పట్టణ ప్రాంతంలో -0.05% నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 1.54%. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏండ్ల తర్వాత 2025 జూన్‌లో తొలిసారిగా డిఫ్లేషన్ -0.93% నమోదైంది. ఆ మరుసటి నెల జూలైలోనూ డిఫ్లేషన్ -0.44% రికార్డయ్యింది. గత సెప్టెంబర్‌లో మళ్లీ 0.15% నమోదైంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్టు సూచిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.