హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/కమాన్‌చౌరస్తా: తెలంగాణ కవి, కరీంనగర్ బిడ్డ వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయనతోపాటు ఏపీకి చెందిన మధురాంతకం నరేంద్రకు కేంద్రం పురస్కారం ప్రకటించిం ది. పురసారం కింద తామ్ర ఫలకంతోపాటు రూ.50 వేల నగదు అందజేయనున్నారు. వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు’ అనే పుస్తకానికి అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురసారానికి ఎం పిక చేసింది. ప్రముఖ కవి, పద్మభూషణ్ గుల్జార్ రాసిన ‘గ్రీన్ పోయెమ్స్’ను వారాల ఆనంద్ తెలుగులో ‘ఆకుపచ్చ కవితలు’ పేరు తో అనువాదం చేశారు. ఈ పుస్తకంలోని 58 కవితలు ప్రకృతికి సంబంధించినవే కావడం విశేషం. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా చక్కగా వివరించారు.
కవి, సినీ విమర్శకుడిగా గుర్తింపు
కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన వారాల ఆనంద్ 1958లో జన్మించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్ననాటి నుంచి సాహిత్యం పట్ల మక్కువ ఉన్న ఆయన ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్, తెలుగు విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. 1978లో మంథనిలో లైబ్రేరియన్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల లైబ్రేరియన్‌గా పనిచేస్తూ 2017లో ఉద్యోగ విరమణ పొం దారు. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ స్థాపనలో కీలకపాత్ర పోషించిన ఆయన పలు డాక్యుమెంటరీలు తీశారు.
కేంద్ర సెన్సార్ కమిటీ సభ్యుడిగా, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు సెక్రటరీగా పనిచేశారు. 2019లో ఆకుపచ్చ కవితలు (గుల్జార్ గ్రీన్ పోయెమ్స్) అనువాదం చేశారు. గతంలో నంది అవార్డు అందుకొన్నారు. ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడంపై సాహితీ గౌతమి సంస్థ పక్షాన డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, కవి దాస్యం సేనాధిపతి, సమైక్య సాహితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాడిశెట్టి గోపాల్, అనంతాచార్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.