హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీఐతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వనజ ఎన్ సర్నా పేర్కొన్నారు. ఏ సమాచారాన్నైనా ఒక్క దరఖాస్తుతో తెలుసుకోవడం సామాన్యులకు గొప్ప అవకాశమని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమాచార హక్కు చట్టంపై భారత వైమానిక దళం ప్రత్యేక కోర్సును నిర్వహించింది. ఈ సందర్భంగా సమాచార కమిషనర్ మాట్లాడుతూ..ప్రజలు ఎంతో నమ్మకంతో ఆర్టీఐని సంప్రదిస్తారని, ప్రతీ దరఖాస్తుకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు.
ఆర్టీఐ దరఖాస్తు వస్తే అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. పూర్తి సమాచారం ఇవ్వడానికి ఆలస్యమైతే, తొలుత కొంత సమాచారంతో సమాధానం ఇవ్వాలన్నారు. మిగిలిన సమాచారం ఎందుకు ఆలస్యమవుతున్నదో దరఖాస్తుదారుడికి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ బెన్హర్ మహేశ్దత్ ఎకా,జాయింట్ డైరెక్టర్ అనితా రాజేంద్ర, ఎయిర్ వైస్మార్షల్ ఆర్ఎస్ సింగ్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ మాధవి పాల్గొన్నారు.