హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండి పడ్డారు. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన ఉపాధి నిధులు 150 కోట్లను వెనక్కి ఇవ్వాలన్న బీజేపీ సర్కారు వెకిలి చేష్టలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బేషరతుగా ఆ నిర్ణయాన్ని వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురు వారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆది నుంచి ఉపాధి పథకాన్ని నీరుగార్చాలని కుట్రలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు.
ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో కల్లాల నిర్మాణం కొనసాగుతున్నదని ఉదహరించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈజీఎస్ కింద కల్లాల నిర్మాణం చేపట్టిందని వివరించారు. మిగతా రాష్ర్టాలకు షరతులు విధించని కేంద్ర సర్కారు కేవలం తెలంగాణపైనే ఆంక్షలు పెడుతున్నదని మండిపడ్డారు. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ధర్నాల్లో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.