మరికల్, జనవరి 04 : మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని, నూతన విధానంతో వ్యవసాయం చేయడం రైతులకు లాభదాయకమని కేంద్ర నోడల్ అధికారి రమణ కుమార్ సూచించారు. ఆదివారం మరికల్ మండల కేంద్రంలో వ్యవసాయ పొలాలను, ఎర్రచందనం పెంపును పరిశీలించారు. నారాయణపేట జిల్లాను ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం కింద మంజూరు చేయడంతో జిల్లాలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం రైతులతో ఆయన మాట్లాడారు. పత్తి పంట సాగు క్రయ విక్రయాలకు రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీసీఐ చైర్మన్తో ఫోన్లో మాట్లాడుతూ రైతుల ఇబ్బందుల గురించి వివరించారు. ఈ పథకం ద్వారా ఆరేళ్లకు రైతుల విత్తనాలు ఎరువుల కోసం సుమారుగా 1000 కోట్లు మంజూరు చేస్తారని తెలిపారు. ఉపాధి హామీ పథకంలోని కూలీలను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా చూడాలని రైతులు కోరారు.
మండల కేంద్రంలోని ఉచ్చల ప్రకాష్ పొలంలో నూతన పద్ధతిలో కూరగాయల పండించే పద్ధతిని పరిశీలించారు.
దండు నారాయణరెడ్డి పొలంలో ఔషధాలకు ఉపయోగపడే ఎర్రచందనం, వివిధ రకాల చెట్లను పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ద్వారా వ్యవసాయాలను చేస్తే అధిక లాభాలు ఉంటాయని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ శంకర ప్రసాద్, శిక్షణ కలెక్టర్ హర్షిత్ చౌదరి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా హార్టికల్చర్ అధికారి, తాసిల్దార్ రామకోటి, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.