ములుగు, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ‘మేడారంలో అమ్మవారి గద్దెలపైకి పూజరులు రావాలంటే గేట్లకు తాళా లు వేస్తున్నరు. పర్మిషన్ తెచ్చుకోవాలని అడ్డుకుంటున్నారు.. మేం ఉండాల్సిన చోట బయటి వ్యక్తులెందుకున్నారు.. అ మ్మవారి గద్దెలు సెంట్రల్ జైలులా ఉన్నా యి.. ఇక్కడ పూజారులకు ప్రాధాన్యత లేద’ంటూ మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు కుమారుడు, పూజారి అరుణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడారం జాతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పూజారులకు తీవ్ర అవమానం జరుగడంపై ఆయన మండిపడ్డారు. బుధవారం సారలమ్మ గద్దెకు చేరే సమయంలో పూజారులు, ఆదివాసీలు ఉండాల్సిన గద్దెలపై వలంటీర్లు, ఇతరుల కు అధికారులు అధిక ప్రాధాన్యమివ్వడం ఏమిటని ప్రశ్నించారు. పూజారులను బయటకు వెళ్లగొట్టే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులు, పూజారులు లోపలికి రావాలంటే గేట్లకు తాళాలు వేసి పర్మిషన్ తెచ్చుకోవాలని అంటున్నారని, ఎవరి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. గద్దెలపై వలంటీర్లు, పంచాయతీ సిబ్బంది, ఇతరులు ఉంటున్నారని, పూజారులు ఎప్పుడూ వచ్చినా అడ్డుకుంటున్నారని, తమకు అనుమతి లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వద్దంటే తాము వెళ్లిపోతామని, జాతరను ఎవరు చేస్తారో చేసుకోండంటూ అరుణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.