Miss World Pagent | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న స్లీపర్‌సెల్స్ నిద్ర లేచాయని, ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా ఉగ్రదాడులు ఉండవచ్చని, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీల నిర్వహణ మీద స్లీపర్‌సెల్స్ దృష్టి సారించే ప్రమాదం ఉన్నదని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అవుట్డోర్ ప్రాంతాల్లో నిర్వహించే అందాల పోటీల ఈవెంట్స్‌ను డేగ కండ్లతో నిశితంగా గమనించాలని ఆదేశించినట్టు సమాచారం. స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానిక సైన్యం సహకారం తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు మూడు వారాలపాటు పూర్తిస్థాయి భద్రత కల్పించడం తెలంగాణ పోలీసులకు పెద్ద సవాల్ కానున్నది.
హైదరాబాద్‌లో స్లీపర్‌సెల్స్
హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో స్లీపర్‌సెల్స్ ఉన్నారని, వీరి కదలికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించినట్టు తెలిసింది. స్లీపర్‌సెల్స్‌ను పునరుద్ధరించడానికి పాకిస్థాన్ నిఘా సంస్థతో అనుబంధం ఉన్న ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు సిద్ధంచేసినట్టు నిఘా సంస్థలు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంచలనం కోసం ఉగ్రదాడులు ఉండవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నట్టు తెలిసింది. మిస్ వరల్డ్ పోటీలను స్లీపర్‌సెల్స్ టార్గెట్ చేసే ప్రమాదం ఉన్నదని, ఆయా దేశాల నుంచి వచ్చిన సుందరాంగులు, విదేశీ మీడియా ప్రతినిధుల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లో స్లీపర్‌సెల్స్ కదలికలపై గట్టి నిఘా పెట్టాలని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సూచన మేరకు నడుచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.
అవుట్ డోర్‌కు వెళ్లినప్పుడు జాగ్రత్త
గురువారం వరకు అందాల పోటీల నిర్వహణపై ఆత్మవిశ్వాసంతో ఉన్న మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తాజా పరిణామాల నేపథ్యంలో పోటీల కొనసాగింపుపై పునరాలోచనలోపడ్డట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్‌లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడంతో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సైతం పోటీలను కొనసాగిస్తే తలెత్తే సమస్యలపై అంతర్జాతీయంగా అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల అనంతరం సుందరాంగులంతా 12వ తేదీ నుంచి నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్‌బజార్, వరంగల్ వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే విధంగా తెలంగాణ టూరిజం ప్రణాళికలు రూపొందించింది. ఈ అవుట్డోర్ ఈవెంట్లే భద్రతకు సవాల్‌గా మారే అవకాశం ఉన్నదని పోలీసులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. చార్మినార్, లాడ్‌బజార్, రామప్ప ఆలయం, పిల్లలమర్రి తదితర ప్రాంతాలను అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించినట్టు తెలుస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుట్డోర్ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో అందాల భామల పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతకు సంప్రదాయ రక్షణ చర్యల కంటే.. సాంకేతికతను వినియోగించుకొని వ్యూహాత్మక రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించినట్టు సమాచారం.
నేటి నుంచి ప్రపంచ అందాల పోటీలు.. పాల్గొననున్న 110దేశాల అందాల భామలు
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. సుమారు 110దేశాలకు పైగా సుందరాంగులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. పోటీలకు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఇప్పటికే రిహార్సల్స్ పూర్తయ్యాయని, పోటీలకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.