హైదరాబాద్, ఫ్రిబవరి 28 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ ఇచ్చింది. త్వరగా పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ పడడంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమానయాన విస్తరణ, వ్యాపారం, పర్యాటక రంగం అభివృద్ధి జరగనుంది.
బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రత్యేక చొరవ చూపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో జీఎంఆర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం 150 కిలో మీటర్ల పరిధిలో 2029 వరకు మరో ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్మాణం చేయొద్దని షరతు ఉంది. ఇదే వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ప్రతికూలంగా మారింది. కేటీఆర్ పలుమార్లు ఎయిర్పోర్ట్ అథారిటీతో సంప్రదింపులు జరిపారు. అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించి అథారిటీకి అప్పగిస్తామని కోరారు. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవసరాన్ని వివరించారు. ఆ చర్చలు కొలిక్కి రావడంతోనే కేంద్రం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను ఉడాన్ పథకంలో చేర్చేందుకు అంగీకరించింది. కేటీఆర్ చూపిన ప్రత్యేక చొరవతో నేడు మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మార్గం సుగుమమైంది.
మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపడం మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. హనుమకొండ ఎంపీగా తన పదవీకాలంలో పార్లమెంట్లో ఈ సమస్యను చాలాసార్లు ప్రస్తావించినట్టు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌తో ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.