హైదరాబాద్, మే 2 (నమస్తేతెలంగాణ) : మావోయిస్టులతో కేంద్రప్రభుత్వం బేషరతుగా శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని వామపక్షాల సదస్సులో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ దేశోద్ధారక భవన్లో శుక్రవారం రాష్ట్ర సదస్సు జరింగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జస్టిస్ బీ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐఎంఎల్ మాస్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రాంచందర్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఏ జానకీరాములు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజారమేశ్, నేతలు సీహెచ్ మురహరి, ప్రసాద్, విశ్వనాథ్, విమలక ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… తేదీ, సమయం నిర్దేశించి మరీ మావోయిస్టులను సంహరిస్తామని ప్రకటించే హకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని అత్యంత దారుణంగా చంపినవారికే క్షమాభిక్ష పెట్టాలని ఆయన కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ కోరారని గుర్తుచేశారు. కానీ, కేంద్రప్రభుత్వం మాత్రం అత్యంత దుర్మార్గంగా మావోయిస్టులను చంపుతున్నదని ఆరోపించారు. ఈ దేశ పౌరులపైనే యుద్ధం ప్రకటించడం ఏమిటని నిలదీశారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ… ఎన్కౌంటర్ ఘటనలను న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు.