ప్రపంచమంతా రైతులను కండ్లల్ల పెట్టుకొని కాపాడుకొంటుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతన్నల కండ్లు పొడిచే పనులు చేస్తున్నది. ప్రైవేటు వ్యాపారిలా వ్యవహరిస్తూ అన్నదాతను రోడ్డున పడేసే చర్యలు చేపడుతున్నది. వరివంటి సంప్రదాయ పంటలు వేయకుండా పప్పు, నూనె గింజలు, చిరు ధాన్య పంటలు వేస్తే ప్రోత్సాహం అందిస్తామని నమ్మబలికి చివరికి నట్టేట ముంచుతున్నది. ఏడేండ్లుగా మక్కలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి పంటల కొనుగోలును బంద్ చేసి రైతులను అరిగోస పెడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే విషయంలో ‘ప్రభుత్వం వ్యాపారం చేయదు’ అని చెప్తున్న కేంద్రం.. రైతులతో మాత్రం పక్కా వ్యాపార ధోరణినే ప్రదర్శిస్తున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘వరి పంట వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి. పప్పులు, నూ నె గింజలు, ఇతర చిరు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం అంది స్తాం’ అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. వరి సాగు వద్దని, ఇకపై ధాన్యం కొనలేమని చెప్పిన కేంద్రం.. ప్రత్యామ్నాయ పంటల కొనుగోలుకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. ఏడేండ్లుగా మక్క లు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇతర చిరుధాన్యాల కొనుగోలు బంద్ చేసింది. ఇతర పంటల్లోనూ మొత్తం దిగుబడిలో కేవలం 25 శాతం కొనుగోలుతో సరిపెడుతున్నది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా కొనుగోలు కోటా పెంచాలని కోరినా అంగీకరించటంలేదు. 2021-22 వానకాలం సీజన్లో ఐదు పంట ఉత్పత్తులను కొనాల్సి ఉన్నా రెండు రకాల పంటల కొనుగోలుకే ఒప్పుకొన్నది. అది కూడా 25 శాతమే. పెసర్లు 6,432 టన్నులు, సోయాబీన్ 60 వేల టన్నుల కొనుగోలుకు అంగీకరించింది. వాస్తవానికి రాష్ట్రంలో ఈ సీజన్లో 23 వేల టన్నుల పెసళ్లు, సోయాబీన్ 2.30 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతాయని అం చనా. ఈ పంటలకు బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న ది. ప్రైవేటు వ్యాపారులే వీటిని కొలుగోలుకుఅవకాశం ఉన్నది. డిమాండ్ లేని మక్కజొన్న, ఇతర పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకొనేందుకు కేంద్రం ముందుకు రావడంలేదు.
కేంద్రం వదిలేస్తే.. రాష్ట్రం ఆదుకొంటున్నది
పంటల కొనుగోలులో కేంద్రం తీరని అన్యాయం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను అక్కున చేర్చుకొంటున్నది. మార్కెట్లో డిమాండ్ లేని పంటలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తూ అన్నదాతను ఆదుకొంటున్నది. ఇందుకోసం మార్క్ఫెడ్ ఇప్పటికే రూ.3 వేల కోట్ల అప్పు చేసింది. రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కేంద్రంకంటే రూ.1,300 కోట్ల అధిక విలువైన పంటలను కొనుగోలు చేసింది. తెలంగాణలో వరి, పత్తితోపాటు మక్కజొన్న కూడా ప్రధాన పంట. కేంద్రం పట్టించుకోకపోయినా మక్క రైతులను రాష్ట్రప్రభుత్వం ఆదుకొంటున్నది. 2019-20లో ఏకంగా రూ.1,700 కొట్ల విలువైన మక్కలను కొనుగోలు చేసింది. రూ.50 కోట్ల విలువైన జొన్నలు కొన్నది. గతేడాది కూడా రూ.485.48 కోట్ల విలువైన మక్కలు, రూ. 98.41 కోట్లతో జొన్నలు రాష్ట్రప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకొన్నది. కేంద్రం మాత్రం మక్కల దిగుమతి సుంకాన్ని తగ్గించి రైతు నెత్తిన పిడుగు వేసింది.
మద్దతు మాటలు నీటి మూటలే
వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలను, నూనె, పప్పు గింజల సాగు చేస్తే ప్రోత్సాహం అందిస్తామని చెప్పిన కేంద్రం పె ద్దల మాటలు నీటిమూటలేనని తేలింది. ఇటీవల రాష్ర్టానికి వచ్చి న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా రైతులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ హామీ అమలు కావటం లేదు. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్ భరోసా కల్పించడంలో కేంద్రం విఫలమైంది.