హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం మానవ నైజం. పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు సహాయం చేయకపోగా, వివక్ష ప్రదర్శిస్తున్నది. తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టిన ప్రధాని మోదీ, వరదలతో నష్టపోయిన తెలంగాణకు మానవతాదృష్టితో సైతం సాయం చేయటం లేదు. 2016లో భారీ వర్షాలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పొలాలు, చెలకలు నీటిమునిగి పంటలకు నష్టం వాటిల్లింది. కేంద్ర బృందం పర్యటించి రూ.2,202 కోట్ల నష్టం జరిగిందని అంచనావేసింది. 2016 అక్టోబర్1న అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అక్టోబర్ 2న రాజ్‌నాథ్‌సింగ్‌కు పూర్తి వివరాలతో రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞాపన పత్రం అందించింది. అప్పటికే రాష్ట్రం వద్ద ఉన్న ఎస్డీఆర్ఎఫ్ నిధులు అయిపోయాయని తెలిపారు. కానీ కేంద్రం ఆనాడు స్పందించలేదు. 2017 మార్చిలో మొక్కుబడిగా రూ.314.22 కోట్లు ప్రకటించింది. అదే పక్క రాష్ర్టాలైన ఏపీకి రూ.584.21 కోట్లు, తమిళనాడుకు రూ. 2,012.45 కోట్లు మంజూరుచేసి వివక్ష ప్రదర్శించింది.
సాయం చేయకపోగా ఉచిత సలహా
మరోసారి 2020లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది. దాదాపు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2020 అక్టోబర్ 15న తక్షణ సహాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖరాశారు. కానీ, మోదీ మనసు చలించలేదు. మీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ నిధులు వాడుకోండంటూ కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది. కేంద్రం నుంచి సహాయం అందడం లేదని భావించిన సీఎం కేసీఆర్, తక్షణ సహాయంగా రూ.550 కోట్లు విడుదల చేసి ప్రజలను ఆదుకొన్నారు. హైదరాబాద్‌లో సర్వస్వం కోల్పోయినవారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆ సమయంలో బీజేపీ నాయకులు నగరంలో పర్యటించి రాజకీయాలు చేశారే తప్ప, నయాపైసా తెచ్చేందుకు ప్రయత్నించలేదు.
అదే సమయంలో కర్ణాటక సీఎం లేఖ రాసిన నాలుగురోజుల్లోనే కేంద్రం రూ.669 కోట్లు విడుదల చేసింది. గుజరాత్లో వరదలు వస్తే అక్కడి సీఎం అడగక ముందే ప్రధాని రూ.500 కోట్ల సహాయం అందించారు.
2020లో వచ్చిన వరదలకు కేంద్రం 2022 ఏప్రిల్ 5న 16 రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసినా, తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు రూ.351.43 కోట్లు, బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌కు రూ.వెయ్యి కోట్లు, కర్ణాటకకు రూ.994.27 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.600 కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు, బీహార్‌కు రూ.1038 కోట్లు విడుదల చేసింది.
సొంత నిధులతోనే పునరుద్ధరణ
వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే రోడ్లను పునరుద్ధరించింది. గత ఏడాది కూడా రూ.వెయ్యి కోట్లతో పనులు చేపట్టింది. వరదలు వచ్చినప్పుడు తక్షణం పనులు చేపట్టడానికి ఆర్ అండ్ బీ అధికారులు ప్రత్యేకంగా నిధులు ఏర్పాటుచేసుకొన్నారు. వివిధ శాఖలకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.