అంబర్‌పేట, మే 9: ‘కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో ఓబీసీలనూ లెక్కించాలి. బీసీ గణన కోసమే నా పోరాటం. ప్రభు త్వం దిగొచ్చేదాకా పోరాటం ఆపబోను’ అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు స్పష్టంచేశారు. బీసీ గణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో శనివారం హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలోని తన నివాసం వద్ద ఆయన ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు న్యాయం జరుగాలంటే జనగణనలో బీసీ జనాబా లెక్కించాలని పలుమార్లు ప్రధానికి లేఖలు రాసినా స్పందన రాలేదని తెలిపారు. అందుకే తాను ఆమరణ దీక్ష చేపట్టినట్టు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ పోరాటాన్ని కేంద్రం దిగొచ్చే వరకు ఆపబోనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌లో ఎస్సీ, ఎస్టీల కాలమ్ ఉన్నాయని, ఓబీసీల కాలం లేదని తెలిపారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో 60 కోట్ల మంది బీసీలు ఉ న్నారని, తెలంగాణలో 56 శాతం ఉన్న ట్టు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఇప్పుడు బీసీగణన చేయకుంటే వందేండ్ల వరకు బీసీలకు న్యాయం జరుగదని ఆందోళన వ్యక్తంచేశారు.
రాజ్యాంగపర రిజర్వేషన్లు కావాలి : సిరికొండ, శ్రీనివాస్‌గౌడ్
ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. వీహెచ్ ఆమరణ దీక్షకు మద్దతు ప్రకటించిన అనంతరం వారు మాట్లాడారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం, అవమానం సహించలేనిదని పేర్కొన్నారు. బీసీలవి గొంతెమ్మ కోర్కెలు కావని, రాజ్యాంగంలో కల్పించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులేనని చెప్పారు. వాటిని అమలు చేయాల్సిన పాలకులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
ప్రధాని రాక సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలు, నల్ల రిబ్బన్లతో ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా బీసీలు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు చేయాలని పిలుపునిచ్చామని తెలిపారు. బీసీల కులగణన చేస్తామని హైదరాబాద్ సభలో ప్రధాని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీలు కోదండరామ్, తీన్మార్ మల్లన్న, కన్వీనర్లు ధనలక్ష్మి, కే వెంకటేశ్, సంతోష్, నాయకులు గుజ్జ కృష్ణ, మేకపోతుల నరేందర్‌గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతరోహిత్ ముదిరాజ్, అంజన్‌బాబు, సంజీవ్ ముదిరాజ్, రాజీవ్‌రెడ్డి, రాజేశ్ అగర్వాల్, ఆర్ లక్ష్మణ్‌యాదవ్, శంభుల శ్రీకాంత్‌గౌడ్, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు బీసీల నిరసన ర్యాలీలు ; ఓబీసీ గణనపై ప్రధాని తేల్చాలి:జాజుల
ఓబీసీ గణన అంశంలో కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీసీలు నిరసన ర్యాలీలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఓబీసీ గణన చేపట్టే అంశంపై హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ స్పష్టంచేయాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన చేపడుతామని గతంలో కేంద్ర క్యాబినెట్లో నిర్ణయించారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత తొలి విడత జనగణన సర్వేలో బీసీ వివరాలను సేకరించడం లేదని, దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న ప్రధాని మోదీ తాము సంధించిన పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.