సంగారెడ్డి : తెలంగాణ వడ్లు కొనకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని కేంద్రం తీరుపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. యాసంగిలో మన వద్ద 36లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. దేశంలోనే యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కలెక్టరేట్లో యాసంగి వడ్ల కొనుగోలుపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద 4,700కోట్ల రూపాయల భారం పడిందన్నారు. ఈసారి రా రైస్‌గా పట్టిస్తున్నాం కావున వడ్లు తడిస్తే పనికి రావన్నారు.
వడ్లు తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు, అధికారులకు మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రల వద్ద టార్పాలిన్ పట్టాలు ఎక్కువ సమకూర్చుకోవాలి. వడ్ల కొనుగోలు జరిగే రోజుల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. వడ్లు కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహించినా, రైతులకు ఇబ్బందులు కలిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైన చోట ప్రైవేట్ గోదాములు అద్దెకు తీసుకోవాలి. రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.