తెలంగాణే కేంద్రానికి ఆదాయమిస్తున్నది: సీఎం
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రం నుంచి రాష్ర్టానికి భారీగా నిధులు వస్తున్నాయన్న ప్రతిపక్షాల ప్రచారంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ రంగంపై చర్చ సందర్భంగా విపక్షాలకు సీఎం చురకలంటించారు. కేంద్రం ఇచ్చుడెక్కడిది? మనం తీసుకొనుడెక్కడిది? కేంద్రం దగ్గర ఉన్నదేంది? మనకు ఇచ్చేదేంది? అసెంబ్లీలో జిమ్మేదారీ సీఎంగా చెప్తున్న. ఈ పిచ్చి మంచిదికాదు. బంద్ చేసుకోండ్రి. ఇది మీకు రాజకీయంగా లాభమనుకుంటున్నరు కానీ దెబ్బ తగులుతది’ అని బీజేపీ నేతలకు సీఎం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి అధికంగా ఆదాయం సమకూరుస్తున్నదని సీఎం అన్నారు. ‘ఒకనాడు మీకు వ్యవసాయం రాదు, తెలివిలేదు అని మాట్లాడిన ఏపీ నుంచి మనం విడిపడ్డం. ఇప్పుడు వాళ్ల తలసరి ఆదాయం రూ.1,70,215 ఉంటే, మనది రూ.2,37,632. ఈరోజు కేంద్రం తలసరి ఆదాయం రూ.1,28,228 మాత్రమే. కేంద్రంతో పోల్చితే మనం డబుల్ ఉన్నం. గతంలో కేంద్రంలో రూ.50-55 వేల కోట్లు అప్పులుంటే, ఈరోజు రూ.1.35 లక్షల కోట్ల అప్పులు చేశారు. మీ దగ్గరనే లేదు. మాకేం ఇస్తరు? మనకు రావాల్సిందే వస్తున్నది. కేంద్రం నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఏడున్నరేండ్లలో వచ్చింది రూ.42 వేల కోట్లు. మన దగ్గరి నుంచి కేంద్రానికి పోయింది రూ.2.74 లక్షల కోట్లు. ఈ దేశాన్ని సాకే రాష్ర్టాలు, దేశ జీడీపీకి, దేశ ఖజానాకు నిధులు సమకూర్చే రాష్ర్టాలు ఆరేడు మాత్రమే. బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ ఉన్నదని ఆర్బీఐ స్పష్టంచేసింది’ అని కేసీఆర్ వివరించారు.