హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం అమలు విషయంలో ఘోరంగా చతికిల పడుతున్నది. ఏకంగా 25 లక్షల ఇండ్లు ఇస్తామని గొప్పలు చెప్పినప్పటికీ నాలుగున్నర లక్షల ఇండ్లు ఇచ్చేందుకే కిందా మీదా పడుతున్నది. కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు అనర్హులకు మంజూరైన ఇండ్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేస్తుంటే ఏమిచేయాలో తోచక మల్లగుల్లాలు పడుతున్నది. పరిస్థితి తారుమారు కావడంపై అసహనం వ్యక్తంచేస్తూ.. ఇండ్ల మంజూరులో కేంద్రం కొర్రీలు పెడుతున్నదని ఆరోపిస్తున్నది. చాలాచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామన్న రాష్ట్ర సర్కారు.. ఇందిరమ్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై పథకంతో అనుసంధానించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండానే హామీలు గుప్పించిన రేవంత్రెడ్డి సర్కారు.. చివరకు కేంద్రం ఇచ్చే నిధులపై ఆధారపడాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన లబ్ధిదారుల జాబితాను కేంద్రం రూపొందించిన యాప్ తిరస్కరిస్తున్నది. ఆధార్ కార్డుల ఆధారంగా వారి ఆర్థిక స్థితిగతులను గుర్తించి మంజూరైన ఇండ్లను కూడా రద్దు చేస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యాయి. ఇల్లు మంజూరు కాలేదని కొందరు, మంజూరైన ఇంటిని రద్దు చేశారని మరికొందరు అడుగడుగునా కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. పరిస్థితి తలకిందులు కావడంతో కేంద్ర పభుత్వం ఇండ్ల మంజూరులో అనేక కొర్రీలు పెడుతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పట్టణ ప్రాంతాలకు మోక్షమెప్పుడో?
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు 3 లక్షలకు మించి ఇండ్లను మంజూరు చేయలేకపోయింది. హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో జీ+3 పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు కనీసం స్థలాల ఎంపిక కూడా పూర్తిచేయలేదు. 4.5 లక్షల ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకే ఆపసోపాలు పడుతున్న రాష్ట్ర సర్కా రు.. 25 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పడం అనేక సందేహాలకు తావిస్తున్నది. ఈ ఏడాది ఇస్తామని చెప్పిన 4.5 లక్షల ఇండ్లకు రూ.22,500 కోట్లు అవసరం కాగా.. ఇప్పటివరకు రూ.250 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏ మేరకు అమలవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఇదీ..