హైదరాబాద్ జనవరి 25 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు- 2026ను ఆదివారం ప్రకటించింది. మొత్తంగా 131 మందికి ఈ అవార్డులను ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు. విభిన్నరంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలు దక్కాయి. ఇందులో గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్), దీపికా రెడ్డి (నృత్యకారిణి), గూడూరు వెంకట్రావు (వైద్యం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్, ఇంజినీరింగ్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), రామారెడ్డి మామిడి (మరణానంతరం) (పశు సంవర్ధక, పాడి పరిశ్రమ) ఉన్నారు. యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది.
రైతుల జీవితాల్లో మామిడి రామారెడ్డి వెలుగులు
వ్యవసాయం, పాడి పరిశ్రమ నిపుణులుగా పేరుగాంచిన మామిడి రామారెడ్డి పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. పశుపోషణ, పాల ఉత్పత్తి రంగాల్లో తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా ‘సహ వికాస’ సంస్థను స్థాపించి సహకార సంఘాలతో కలిసి పాడి పరిశ్రమను రైతులు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునేందుకు అనితర కృషి చేశారు. రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక పద్ధతులను మేలవించారు. పాడిరంగంలో మహిళలను భాగస్వామ్యుల్ని చేసేందుకు విశేష కృషి చేశారు. పాడి పరిశ్రమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆయన 2025 అక్టోబర్ 26న మరణించారు.
జన్యు రహస్యాల ఛేదనలో కుమారస్వామి తంగరాజ్
ఈ పేరు అందరికీ తెలియకపోయినా.. జ న్యు పరిశోధన రంగంలో ఆయన పేరు సుపరిచితం. హైదరాబాద్‌లోని సీసీఎండీలో సుమా రు 30 ఏండ్లుగా మానవుల జన్యు రహస్యాన్ని ఛేదించేందుకు సీనియర్ శాస్త్రవేత్తగా కృషి చేస్తున్నారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
నాట్యమయూరి దీపికారెడ్డి
1965 సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో జన్మించిన దీపికారెడ్డి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణిగా పేరుగాంచారు. ఆమె తండ్రి వీఆర్ రెడ్డి .. అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పని చేశారు. తల్లి రాధికారెడ్డి కూచిపూడి నృత్యకారిణి. ఆమె తాత నూక రామచంద్రారెడ్డి ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన నాలుగుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇక దీపికారెడ్డి గడిచిన 50 ఏళ్లలో ఆమె ఎన్నో ప్రత్యేకమైన ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు నాట్య గురువు అవార్డులు ఆమెకు దక్కాయి. కూచిపూడి నృత్యరంగంలో ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
‘ఆకాశ’మే హద్దుగా చంద్రమౌళి ఆలోచన
చంద్రమౌళి గడ్డమనుగు ప్రముఖ డీఆర్డీవో శాస్త్రవేత్త. 1959 అక్టోబర్‌లో మధిరలో జన్మించారు. ఆకాశ్ మిస్సైల్ రూపకర్తల్లో చంద్రమౌళి గడ్డమనుగు కూడా ఒకరు. నాడు ఇండియన్ మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్‌కలాంతో అకాశ్ క్షిపణిని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఆయన కొన్నేండ్ల పాటు అకాశ్ ప్రాజెక్టుకు డైరెక్టర్‌గానూ, ప్రొగ్రాం డైరెక్టర్‌గానూ పనిచేశారు. దాదాపు 35 ఏళ్లపాటు దేశ రక్షణ రంగానికి ఆయన సేవల్ని అందించారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
క్యాన్సర్ పని పట్టిన పాల్కొండ విజయ్ ఆనంద్‌రెడ్డి..
డాక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు. 1959 అక్టోబర్ 20న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన ఉస్మానియా నుంచి వైద్యవిద్యను అభ్యసించారు. క్యాన్సర్ చికిత్సలో ఆయన దేశ విదేశాల్లో నిపుణులుగా పేరుగాంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్‌గా ఉన్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
వైద్యరంగంలో గూడూరు వెంకట్రావ్
వైద్యరంగంలో గ్యాస్ట్రోలజిస్ట్గా విశేష సేవలందించిన వెంకట్రావ్‌కు పద్మ అవార్డు దక్కింది. ఎన్నో రకాలు శస్త్రచికిత్సలతో పాటు మధుమేహం పై మైక్రో ఎన్క్యాప్సులేషన్ పరికరాన్ని కనిపెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. వైద్యరంగంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కింది.
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగాల్లో కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగాల్లో విశేష కృషి చేసిన కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణి యన్‌కు పద్మ అవార్డు దక్కింది.
విద్యావిధాన రూపకర్త జగదీశ్‌కుమార్
ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ బిడ్డ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృషికి గాను ఆయన్ను పద్మశ్రీ పురస్కారానికి ఎంపికచేసింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మామిడాల ఆయన స్వస్థలం. అయితే ఆయన్ను ఢిల్లీ రాష్ట్రం నుంచి కేంద్రం ఈ పురస్కారానికి ఎంపికచేసింది. ఐఐటీ మద్రాస్ నుంచి జగదీష్‌కుమార్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంఎస్, పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కేంద్రం ఆయనను జేఎన్‌యూ వీసీగా నియమించగా, 2016-22 వరకు ఆయన విజయవంతంగా సేవలందించారు. ఆ తర్వాత 2022 -25 వరకు మూడేండ్లపాటు యూజీసీ చైర్మన్‌గా సేవలందించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశపెట్టడంలో జగదీశ్‌కుమార్ కీలక భూమికను పోషించారు.
తెలంగాణ మేధావులకు సముచిత స్థానంపద్మ పురస్కారాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం: కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి చెందిన మేధావులకు సముచిత స్థానం దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ర్టానికి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దకడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం హర్షం వ్యక్తంచేశారు. విభిన్న రంగాలల్లో తెలంగాణ ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో విశేష పరిశోధనలు చేసిన చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్, కుమారస్వామి తంగరాజ్లకు పద్మశ్రీ పురసారాలు లభించడం, వారి మేధస్సుకు దకిన సముచిత గౌరవమని కేటీఆర్ ప్రశంసించారు. వీరితో పాటు వైద్య రంగంలో సామాన్యులకు అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ సర్జన్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు పాలొండ విజయఆనంద్రెడ్డికి ఈ అత్యున్నత గౌరవం దకడంపై సంతోషం వ్యక్తం చేశారు. కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డికి నృత్య రంగంలో ఆమె చేసిన అద్భుత ప్రదర్శనలకు గానూ ఈ పురసారం లభించిందని గుర్తుచేశారు. పశుసంవర్ధక రంగంలో నిస్వార్థ సేవలు అందించిన రామారెడ్డి మామిడికి తన మరణానంతరం పద్మశ్రీ ప్రకటించడం ఆయన చేసిన సేవలకు దకిన నిజమైన గుర్తింపు అని కేటీఆర్ అభివర్ణించారు. ఈ పురసారాలు భావితరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆయన ఆకాంక్షించారు. పురసార గ్రహీతలందరికీ కేటీఆర్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిభ దేశ కీర్తిని మరింత ఇనుమడింపచేయాలని ఆయన అభిలషించారు.
అవార్డు గ్రహీతలకు అభినందనలు: మాజీ మంత్రి హరీశ్
పద్మ అవార్డులకు ఎంపికైన తెలంగాణ వారందరికీ మాజీ మంత్రి హరీశ్‌రావు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆదివారం ఆయన ఎక్స్ ద్వారా ఈ తన శుభాభినందనలు ప్రకటించారు. ముఖ్యంగా డాక్టర్ కుమారస్వామి తంగిరాజు, మామిడి రామారెడ్డి వంటి వారికి ఈ అవార్డు దక్కడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఆయా రంగాల్లో వారు చేసిన విశేషమైన సేవలకు గుర్తింపు దక్కడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ఈ అవార్డులు రాష్ట్ర ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపచేస్తుందని ఆకాంక్షించారు.