హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మనబడి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని బండి సంజయ్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.3,497 కోట్లతో చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి కేంద్రం ఇచ్చిన రూ.2,700 కోట్లు ఎకడ ఉన్నాయో? ఆ పైసలు ఎక్కడ విత్డ్రా చేసుకోవాలో బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. ఇలా అబద్ధాలు మాట్లాడటం మానుకొని.. దమ్ముంటే విద్యారంగంలో కేంద్రం తెలంగాణకు చేసిన అన్యాయంపై ప్రధాని మోదీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని హితవుపలికారు.
విద్యాసంస్థల కేటాయింపులో తెలంగాణ పట్ల కేంద్రం అడుగడుగునా వివక్ష చూపుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, గిరిజన వర్సిటీని మంజూరు చేయడంలేదని గుర్తుచేశారు. ఐఐటీలు, ఐఐఎంలు, నిట్, మెడికల్ కాలేజీలు దేశమంతా ఇచ్చి తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, వాటిని రాష్ర్టానికి తెచ్చేందుకు సంజయ్ కృషి చేయాలని సూచించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ నేతలు ఎం దుకు మాట్లాడటం లేదన్న మంత్రి, ‘బేటీ బచావో- బేటీ పడావో’ అంటూనే మోడల్ స్కూళ్లను ఎత్తివేసిన ఘనత కేంద్రానికి కాదా? అని ప్రశ్నించారు. గురుకులాలు, మన ఊరు-మన బడి వంటి కార్యక్రమాలతో విద్యారంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తున్నదని, దేశ, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వస్తున్నదని చెప్పారు.
సర్కారు బడులు కార్పొరేట్ స్థాయికి మించి తయారవుతుంటే బండి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. రాజకీయాలతో విద్యారంగాన్ని ముడిపెట్టకుండా, బడిబాట కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ చదువులను అందించాలన్న లక్ష్యానికి సహకరించాలని సూచించారు. ఒక పక టెట్ వాయిదా వేయాలంటూనే, మరో పక 20 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మాట్లాడటం బండి సంజయ్ ద్వంద్వ నీతికి నిదర్శమని మండిపడ్డారు.