సూర్యపేట : దేశ భక్తి మాటున బీజేపీ ప్రభుత్వం దేశానికి ద్రోహం చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మోడీ ఆదానీల స్నేహ బంధం ప్రజలకు అర్ధమౌతుందని, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుందని అన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రాష్ట్రం అప్పులు చేస్తుందని స్పష్టం చేశారు.
పరిమితికి మించి అప్పులు చేసింది కేంద్రమేనని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని అన్నారు. అనేక తప్పులు చేస్తున్న బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందేనని వ్యాఖ్యనించారు.
విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ను రూ. 50 వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈ ఆర్ సీ నిర్ణయం పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని మండి పడ్డారు.ఆదాని లాంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
సంస్కరణల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల డబ్బులు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గం చేస్తుందని అన్నారు.‘కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కావు. ప్రజలను పీల్చిపిప్పి చేసే నల్ల విద్యుత్ చట్టాల’ని విరుచుకుపడ్డారు.విద్యుత్ విషయంలో కేంద్రం తప్పుడు విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్ర నిర్ణయం సాధారణ ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించారు.
రూ.50 వరకు అమ్ముకోవచ్చంటే ప్రజలను చీకట్లోకి నెట్టి దోపిడీ చేయడమేనని అభిప్రాయపడ్డారు.దేశంలో సొంత బొగ్గువనరులు ఉండగా కేంద్రం విదేశీ బొగ్గు ఎందుకు తెస్తుందని ప్రశ్నించారు.ఆదాని విదేశీ బొగ్గుని బలవంతంగా రాష్ట్రాలకు అమ్మిస్తున్న కేంద్రం విదేశీ బొగ్గు తోనే విద్యుత్ సమస్య ఏర్పడనుందని పేర్కొన్నారు. కేంద్ర ఈ ఆర్ సీ నిర్ణయం ఆదానికే లాభమని అన్నారు. కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి ఆదానికీ మేలు చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తుందని ఆరోపించారు.