హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో గురువారం నుంచి 24 వరకు పర్యటించనున్నది. ఈ బృందం మూడురోజుల పాటు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనున్నది. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆదాయపు పన్ను శాఖ అధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానున్నారు.
జిల్లాల ప్రొఫైళ్లు సిద్ధం చేయండి: డీజీపీ
రాష్ర్టానికి మరికొన్ని రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రొఫైళ్లను పకడ్బందీగా రూపొందించుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ అంజనీకుమార్ సూచించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమణ, ఎన్నికల నేరాలు, న్యాయ సంబంధిత అంశాలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్హెచ్ఓలకు మంగళవారం ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ వచ్చి ఎన్నికల అధికారులు, రాష్ట్ర, కేంద్రస్థాయి ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు. గొడవలు, హింసాత్మక ఘటనలకు దారి తీసే కార్యకలాపాల పట్ల పోలీసులకు జాగరూకత అవసరమని పోలీస్ శాఖ లీగల్ అడ్వైజర్ శ్రీరాములు సూచించారు. కార్యక్రమంలో సీఐడీ విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, మల్టీజోన్-2 ఐజీ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.