Assembly Elections | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణకు ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజునుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 2024 జనవరి 16తో రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఓటర్లు@3.17 కోట్లు
రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరి కోసం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతానికి భిన్నంగా ఈ సారి దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు తమ ఓటు హక్కును ఇంటి నుంచే వినియోగించుకొనే సదుపాయాన్ని కల్పించారు. ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సీ విజిల్ యాప్‌ను ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి కేంద్ర బలగాలు కూడా రానున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. రాష్ట్రంలో 80 ఏండ్లు పైబడిన వారు 4.44 లక్షల మంది ఉండగా, 100 ఏండ్లకు పైబడిన వారు 7,689 మంది ఉన్నారు. 5.06 లక్షల మంది దివ్యాంగులు ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరికి సౌలభ్యంగా ఉండేలా అనువైన విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. ఇంటి నుంచే ఓటు వేయడానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 12 డీ ఫారంను పూర్తి చేసి స్థానికంగా ఉండే బూత్ లెవల్ ఆఫీసర్‌కు సమర్పించాలి. 12 డీ ఫారంను పూర్తి చేసిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తారు. వీరు ఇంట్లో ఉండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
దేశంలో అత్యధిక వెబ్‌కాస్టింగ్ తెలంగాణలోనే
ఎన్నికల నిర్వహణను స్వేచ్ఛగా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణలో 27,798 (78 శాతం) పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించారు. 2018 ఎన్నికల్లో 20,337 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్‌కాస్టింగ్ చేయగా.. ఈసారి వాటి సంఖ్యను పెంచారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ర్టాల్లో అత్యధిక శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మధ్యప్రదేశ్‌లో 35 వేల పోలింగ్ కేంద్రాలు (50 శాతం), రాజస్థాన్‌లో 26 వేల పోలింగ్ కేంద్రాలు (50 శాతం), ఛత్తీస్‌గఢ్‌లో 12,055 (50 శాతం) పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు.
148 చెక్‌పోస్టుల ఏర్పాటు
తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యం, నగదు, ఇతర వస్తువులు రాకుండా తనిఖీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీసు, అటవీ, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ టాక్స్ శాఖల ఆధ్వర్యంలో చెక్ పోస్టులు పనిచేయనున్నాయి. వీటి పర్యవేక్షణకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ నిఘా
ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో మద్యం, డ్రగ్స్, నగదు, ఉచితాలు పంపిణీ చేయకుండా, ఓటర్లను ప్రలోభపెట్టకుండా చూడాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఎన్ఫోర్స్మెంట్ శాఖలతో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేశారు. దాదాపు 20 శాఖల అధికారులను ఎన్ఫోర్స్మెంట్ బృందంలో భాగస్వామ్యులను చేసి, నాలుగు సబ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. బంగారం, వెండి, ఇతర వస్తువులు, డ్రగ్స్, మద్యం, నగదు ఇలా నాలుగు సబ్ గ్రూపులుగా ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా శాఖలు జిల్లాలవారీగా నోడల్ అధికారులను నియమించాయి. ఆయా శాఖలు తమ పనిలో నిమగ్నమయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి వారి పాత్రపై స్పష్టత ఇచ్చారు. ఈడీ, ఐటీ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఎన్ఫోర్స్మెంట్ పరిధి శాఖలు
1.స్టేట్ పోలీస్, 2.సెంట్రల్ ఎక్సైజ్‌శాఖ, 3.సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ 4.స్టేట్ జీఎస్టీ, 5.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, 6.సీఐఎస్ఎఫ్, 7.ఐటీ, 8.ఈడీ, 9.బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, 10. రాష్ట్ర రవాణా శాఖ, 11.ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా, 12.స్టేట్ సివిల్ ఏవియేషన్ శాఖ, 13.పోస్టల్‌శాఖ, 14.ఆర్బీఐ, 15.ఎస్ఎల్బీసీ, 16.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, 17.స్టేట్ నార్కోటిక్స్ వింగ్, 18.సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, 19.రైల్వే, 20.అటవీ శాఖ
2018లో ఇలా..
గత అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం 2018 అక్టోబర్ 7న షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 6న రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాగా.. అక్టోబరు 7న షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 12 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించారు. డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 11న కౌంటింగ్ జరిగింది. చివరి దశలో తెలంగాణకు ఎన్నికలు నిర్వహించారు.
ఈవీఎంల ద్వారానే ఎన్నికలు
రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ఈవీఎంల ద్వారానే జరుగనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్లోనూ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 72,933 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి అవసరానికంటే 209 శాతం అదనంగా ఉన్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. కంట్రోల్ యూనిట్లు 57,691 (165 శాతం అధికంగా), వీవీ ప్యాట్లు 56,745 (163 శాతం అధికంగా) ఉన్నాయి. ఈవీఎంల పరిశీలనను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే పూర్తి చేశారు. ఓటింగ్ రోజు ఒకసారి, అంతకంటే ముందు మరోసారి పరిశీలించనున్నారు.
నిర్వహణకు 2 లక్షల మంది సిబ్బంది
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 2 లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజున పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. వీరికి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే శిక్షణలు ప్రారంభమయ్యాయి. ప్రిసైడింగ్ అధికారుల క్యాటగిరీ వరకు దాదాపుగా అన్ని రకాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు 1,96,312 మంది సిబ్బంది అవసరమని, 2,01,126 సిబ్బంది ఉన్నారని
గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అత్యవసరంగా మరో రెండు శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బంది, అధికారులను విధులనుంచి మినహాయించారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
రాష్ట్రంలోనిఓటర్ల వివరాలు
మిజోరం
నవంబర్ 7: పోలింగ్
డిసెంబర్ 3 : ఓట్ల లెక్కింపు
ఛత్తీస్‌గఢ్
నవంబర్ 7, 17: పోలింగ్
డిసెంబర్ 3 : ఓట్ల లెక్కింపు
మధ్యప్రదేశ్
నవంబర్ 17: పోలింగ్
డిసెంబర్ 3 : ఓట్ల లెక్కింపు
రాజస్థాన్
నవంబర్ 23: పోలింగ్
డిసెంబర్ 3 : ఓట్ల లెక్కింపు
చెక్ పోస్టుల వివరాలు
అసెంబ్లీ నియోజకవర్గాలు 119
రాష్ట్రంలో ఓటర్ల వివరాలు
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల వివరాలు