హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేరళ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎంబీ రాజేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు – సవాళ్లు ’అనే అంశం పై హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కొంతకాలంగా కేంద్రం ఉపాధి హామీ పథకంలో కఠిన నిబంధనలు విధిస్తూ ఇజీఎస్ అమలులో దేశంలోనే ముందు వరుసలో ఉన్న తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. ఇజీఎస్ అమలులో ఇప్పటి వరకు దేశంలోనే తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ప్రథమస్థానంలో ఉన్నాయని, కక్షపూరితంగా ఈ రాష్ట్రాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కక్ష కట్టి ఆరు నెలలుగా ఉపాధి హామీ పథకాన్ని ఆ రాష్ట్రంలో నిలిపివేశారని పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, పంజాబ్ లో ఇప్పటికే పర్యవేక్షక టీంల పేరిట వేధింపులు మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. తెలంగాణలో 2014 నుంచి 2018 వరకు కేవలం 3 టీం ల ను పంపిస్తే, ఈ ఏడాది 18 టీం లను పంపించి లేని తప్పులను ఎత్తి చూపి, పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తుందని మంత్రి దయాకర్రావు ఆరోపించారు. ఇజీఎస్ ద్వారా రాష్ట్రాలు ప్రజలకు ఉపయోగ పడే పనులు చేస్తుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయాడం శోచనీయమని వెల్లడించారు. ఇజీఎస్లో రైతు కల్లాలు తెలంగాణాలో కడుతుంటే రైతులకు అవసరమా అని ప్రశ్నిస్తుందని తీర ప్రాంత రాష్ట్రాల్లో చేపలు, రొయ్యలు ఎండ బెట్టుకోవడానికి అనుమతించడం వివక్ష కారణం కాదా అని ప్రశ్నించారు.
కూలీలకు పనిముట్ల విషయంలోనూ కొర్రీలు పెడుతుందని ఆరోపించారు. ఉపాధి హామీ పై కేంద్ర వైఖరి కి నిరసనగా జాతీయ స్థాయిలో రాష్ట్రాల సమష్టి పోరాటం చేయవలిసిన అవసముందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఈ సెమినార్ లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ , సీపీఎం జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘాల బాధ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్మికులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.