హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ గ్రహణం పట్టిస్తున్నది. తన మాట వినని, ప్రతి పక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఉపాధి హామీ నిధులను నిలిపివేసి కూలీల కడుపు కొడుతున్నది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌కు నిధులను నిలిపివేసింది. ఇప్పుడు కేంద్రం దృష్టి తెలంగాణపై పడింది. తనిఖీల పేరుతో కుంటిసాకులు, సాంకేతిక కారణాలు చూపుతూ నిధులు నిలిపివేసే కుట్ర చేస్తున్నది.
సిల్లీ కారణాలు
పశ్చిమబెంగాల్లో సాంకేతిక కారణాలు చూపి గత డిసెంబర్ నుంచి ఉపాధి హామీకి కేంద్రం నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది. అదే తరహాలో తెలంగాణలోనూ చేయాలని చూస్తున్నది. దీనిలో భాగంగా 15 ప్రత్యేక తనిఖీ బృందాలను రాష్ర్టానికి పంపింది. ఆ బృందాల బెదిరింపులు చూసి కూలీలే మండిపడుతున్నారు. ‘చెరువులో పూడిక తీసే సమయంలో నీటిపారుదల శాఖ అనుమతులు తీసుకోలేదు.. కాబట్టి ఈ పనులకు నిధులు నిలిపివేస్తాం. మరోచోటు రికార్డుల్లో చూపించిన మొక్కల కంటే తక్కువగా ఉన్నాయి.. కాబట్టి మొక్కలు నాటడానికి ఖర్చుచేసిన నిధులన్నీ రికవరీ చేస్తాం. మొక్కల పెంపకంలో మొక్కకు మొక్కకు మధ్య దూరం తక్కువ ఉన్నది కాబట్టి డబ్బులు ఇవ్వం’ అంటూ సిల్లీ కారణాలను చూపుతున్నాయి. పలు గ్రామాల్లో పర్యటించిన బృందాలు ఎక్కడా పనిచేయకుండానే డబ్బులు తీసుకొన్నారని నిరూపించలేకపోయాయి. దీంతో చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపుతూ నిధులు నిలిపేసే ఎత్తులు వేస్తున్నాయి. నిజానికి తెలంగాణలోనే ఉపాధి నిధులతో దీర్ఘకాలం ఉపయోగపడే పనులు చేపట్టారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, రైతు వేదికలు, రైతు కల్లాలు నిర్మించారు. ఉపాధి పనులపై మొదట సామాజిక తనిఖీలు చేసింది కూడా తెలుగు రాష్ర్టాల్లోనే. 2020 నుంచి కేంద్రం తనిఖీలు విపరీతంగా పెరిగాయి. దాదాపు ప్రతి నెలా ఏదో ఒక స్థాయి అధికారుల బృందం రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేయడానికి వస్తూనే ఉన్నది.
ఉపాధి హామీలో రాష్ర్టానికి అవార్డులు..
రాష్ట్రం ఉపాధి హామీ పనుల అమల్లో అనేకసార్లు అవార్డులు గెలుచుకొన్నది. 2014-15లో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. సామాజిక భాగస్వామ్యం విభాగంలోనూ అవార్డు లభించింది. జిల్లా స్థాయిలో పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకు నిజామాబాద్ జిల్లాకు జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ స్థాయిలో కరీంనగర్ జిల్లా చందుర్తికి అవార్డు ఇచ్చారు.
2015-16లో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో మరోసారి అవార్డు దక్కింది. జిల్లాస్థాయిలో వరంగల్‌కు, గ్రామ స్థాయిలో నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్‌కు అవార్డులు దక్కా యి. పథకం పాలనా విభాగంలో నిజామాబాద్ జిల్లా గన్నారం పంచాయతీకి అవార్డు దక్కింది.
2017-18లో పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలన కింద జాతీయ అవార్డులు దక్కాయి. జిల్లా స్థాయిలో వికారాబాద్‌కు, గ్రామ స్థాయిలో సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌కు అవార్డులు లభించాయి. సంగారెడ్డి జిల్లా మక్తా లక్ష్మాపూర్‌కు పోస్టాఫీస్ ద్వారా డబ్బు చెల్లింపులో జాతీయ అవార్డు దక్కింది.
2018-19లో మిషన్ వాటర్ కన్జర్వేషన్ అమలులో రాష్ట్ర స్థాయి అవార్డు తెలంగాణకు దక్కింది. జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. గ్రామ పంచాయతీ స్థాయిలో వికారాబాద్ జిల్లా లింగంపల్లెకి అవార్డు వచ్చింది. 2018-19 తర్వాత అవార్డులు నిలిపివేశారు. ఇవే కాకుండా తెలంగాణ పల్లెలకు కేంద్రం మొత్తం 81 అవార్డులను ప్రకటించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్, ఈ -పంచాయతీ అవార్డులు మన గ్రామాలకు దక్కాయి. తెలంగాణ పల్లెల ప్రగతిని కేంద్ర మంత్రులు అనేకసార్లు ప్రశంసించారు. అవన్నీ వదిలేసి రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఉపాధి నిధులు నిలిపేసేందుకు కేంద్రం కుయుక్తులు పన్నుతున్నది.