Cattle insurance | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పశుబీమా పథకం నిలిచిపోవడంతో పాడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు ప్రకృతి విపత్తులు, అనారోగ్యంతో మృత్యువాతపడితే పాడి రైతులు ఈ బీమాతో ఉపశమనంపొందేవారు. కానీ ప్రస్తుతం పశుబీమా పథకం నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిని పునరుద్ధరించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయం, పాడి పరిశ్రమే ప్రధాన ఆధారంగా ఉంటుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, కరువు సమయంలో పాడిపశువులు ఎన్నో మృత్యువాత పడుతున్నాయి. దీంతో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన పాడిరైతులు బీమా సౌకర్యంలేక ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ముఖ్యంగా పాడి పశువులను ఎక్కువగా సాకుతున్న ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ రైతులు పశుబీమా లేక ఆర్థికంగా నష్టపోతున్నామని.. ప్రభుత్వం స్పందించి పశుబీమా పథకాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.