హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూల్స్ విద్య రూపురేఖలు మార్చడంలో భాగంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు జిల్లాకొక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఇటీవలే సర్కార్ పచ్చ జెండా ఊపింది. 29 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రంలో 194 మాడల్ స్కూల్స్ ఉండగా, 29 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసి మెరిట్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలోని విదార్థులకు జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తారు. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ శిక్షణ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక శిక్షకులకు ఒక్కో రోజుకు రూ. 800 పారితోషికంగా అందజేస్తారు. అంతేకాకుండా వీటిని క్రీడా సెంటర్లుగా అభివృద్ధి చేస్తారు.