హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్టీఎస్ఈ) స్కాలర్షిప్స్ను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టేసింది. అసలు ఈ స్కీమ్ అమల్లో ఉన్నదో.. లేదో అన్న విషయంపై కేంద్రం స్పష్టతనివ్వడం లేదు. దీంతో ఈ స్కీమ్ కింద ఎంపికైన, కొత్తగా రాద్దామనుకొంటున్న విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను అమలు చేస్తున్నది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఎన్సీఈఆర్టీ) పరీక్ష నిర్వహిస్తుంది. అయితే, ఎన్టీఎస్ఈ పరీక్షపై ఎన్సీఈఆర్టీ మీన మేషాలు లెక్కిస్తున్నది. 2022 ఎన్టీఎస్ఈ నిర్వహణకు ఎన్సీఈఆర్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఒక్క తెలంగాణ నుంచే 31 వేలకు పైగా విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. ఒక్కో విద్యార్థి నుంచి ఫీజుగా రూ.100 వసూలు చేసింది. వాస్తవానికి ఈ పరీక్ష 2021 నవంబర్లో జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా 2022 జనవరిలో నిర్వహిస్తామని ఎన్సీఈఆర్టీ తొలుత ప్రకటించింది. తర్వాత మార్చికి వాయిదావేసింది. స్టేజ్ -1 ఎగ్జామ్స్ 2020 మార్చిలో జరగాల్సి ఉండగా, వాయిదావేయాలని ఎన్సీఈఆర్టీ అదేశాలిచ్చిది. పైగా 2023 కోసం ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇంత వరకు జారీచేయలేదు.
ఇదీ సంగతి
స్పష్టత కోరుతూ లేఖ రాశాం
ఎన్టీఎస్ఈ పరీక్ష నిర్వహించే అంశంపై స్పష్టత కోరుతూ గతంలోనే ఎన్సీఈఆర్టీకి లేఖ రాశాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్వహించరాదని వారు ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్టేజ్-1 పరీక్షను వాయిదావేశాం. ఆ తర్వాత మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతానికి ఎన్టీఎస్ఈకి కాకుండా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) కు మాత్రమే దరఖాస్తులు స్వీకరించి ప్రాసెస్ చేస్తున్నాం.
– కృష్ణారావు,ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్