హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశానికి దిక్సూచిగా మారటంతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ అన్నింటా ముందు వరుసలో నిలవటంతో అక్కసు వెళ్లగక్కుతున్నది. తెలంగాణ ఏర్పాటైన 2014 నుంచే నిధులు ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నది. తొమ్మిదేండ్లుగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సరిగా ఇవ్వకుండా అవస్థలు పెడుతూనే ఉన్నది. ఈ సారైనా కేంద్రం తీరు మారుతుందని ఆశిస్తున్న తెలంగాణకు ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో నిరాశే ఎదురవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరమూ కేంద్రం అదే కక్షసాధింపును కొనసాగించింది. ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో తెలంగాణకు అణాపైసా ఇవ్వలేదు. మిగిలిన రాష్ర్టాలకు మాత్రం ఎంతోకొంత చేయూతనిచ్చిన కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. 2014 నుంచి 2023 వరకు కేంద్రం నుంచి రూ.2,02,947 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వస్తుందని తెలంగాణ అంచనా వేసింది. కానీ కేంద్రం రూ.88,106 కోట్లు మాత్రమే ఇచ్చింది.
కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రమైనప్పటికీ.. పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ దేశ ఆర్థికానికి దిక్సూచిగా మారుతున్న తెలంగాణను కేంద్రం అవస్థలు పెడుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో భాగంగా రూ.400 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. అయితే కేంద్రం మాత్రం ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్‌కు రూ.114 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.611 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.628 కోట్లు, త్రిపురకు రూ.352 కోట్లు, మహారాష్ట్రకు రూ.96 కోట్లు అందజేసింది. బీజేపీయేతర రాష్ర్టాలైన పంజాబ్‌కు రూ.468 కోట్లు, కేరళకు రూ.396 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.76 కోట్లు గ్రాంట్ ఎయిడ్ విడుదల చేశా రు. మిగిలిన ఇతర రాష్ర్టాలకు సైతం ఎంతోకొంత గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించారు. కానీ.. తెలంగాణపై మాత్రం కక్షసాధింపును కొనసాగించారు.