Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి వద్దకైనా వెళ్తాం. రాష్ట్ర ప్రయోజనాలపై బేషజాలకు తావులేకుండా వ్యవహరిస్తాం. ప్రధాని మోదీ నాకు పెద్దన్న లాంటివారు. ఆయనను అడిగి పెండింగ్ ప్రాజెక్టులన్నీంటిని క్లియర్ చేయించుకుంటాం’ అంటూ బీరాలు పలికినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకున్న మెట్రోరైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయించలేకపోతున్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించి, గత నెల 4న కేంద్రానికి పంపింది. కానీ, ఇప్పటివరకు ఆ డీపీఆర్‌పై మోదీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫేజ్-2 కింద హైదరాబాద్‌లో 76.4 కి.మీ. మేర మెట్రో విస్తరణ కోసం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను రూపొందించారు.
ఇందులో కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,313 కోట్లు, పీపీపీ కాంపొనెంట్‌గా రూ.1,033 కోట్లు వెచ్చించాలని, మిగిలిన రూ.11,693 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోవాలని నిర్ణయించిన విషయం తెలింసిదే. కానీ, ఈ ప్రాజెక్టును ఏమాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఢిల్లీ మెట్రో ఫేజ్-4 ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపింది. రూ.6,230 కోట్లతో 26.4 కి.మీ. పొడవున నిర్మించనున్న ఈ ప్రాజెక్టుతోపాటు ఇతర రాష్ర్టాలకు సంబంధించిన మరో మూడు మెట్రో రైల్ డీపీఆర్‌లను ఆమోదించింది. దీంతో రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ మెట్రో విస్తరణలో పురోగతి లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకే నిధుల్లేక ఆపసోపాలు పడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించే పరిస్థితి లేనందునే హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని తెలుస్తున్నది.