హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలతో ఈ పథకాన్ని నీరుగార్చిన కేంద్రం.. బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టింది. అంతటితో ఆగకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో తెలంగాణకు కేటాయించిన పనిదినాలను భారీగా కుదించింది. గత రెండు సంవత్సరాలుగా కేంద్రం కేటాయించిన పనిదినాల కంటే ఎక్కువ పనిదినాలను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి 15 కోట్ల పనిదినాలను కేటాయించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని పట్టించుకోకుండా కేంద్రం 10 కోట్ల పనిదినాలను మాత్రమే కేటాయించింది. తద్వారా తెలంగాణ పట్ల మరోసారి వివక్షను ప్రదర్శించింది.
ఉపాధి హామీ పనులను అత్యధికంగా వినియోగించుకునే రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. గత మూడు సంవత్సరాలుగా అడిగిన ప్రతి కూలీకి పని ఇవ్వడంతోపాటు అత్యధిక కుటుంబాలకు 100 రోజుల పనిదినాలను కల్పించిన రాష్ట్రంగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.28 లక్షల కుటుంబాలకు, 2019-20లో 3.42 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనిదినాలను కల్పించింది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 14.40 కోట్ల పనిదినాలను, 2020-21లో అత్యధికంగా 15.79 కోట్ల పనిదినాలను కల్పించింది. అయినా ఇవేమీ పట్టించుకోకుండా కేంద్రం ఈసారి 10 కోట్ల పనిదినాలను మాత్రమే కేటాయించడంతో రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పనిదినాలు తగ్గనున్నాయి. ఇదేమని అడిగితే.. కేటాయించిన పనిదినాలు పూర్తయ్యాక మళ్లీ కేటాయిస్తామని కేంద్రం చెప్తున్నది.