సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 14 : కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్తును ఆపే ప్రసక్తే లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు అందించే రాయితీ విద్యుత్తుపై కేంద్రం కుట్రలు పన్నడం దుర్మార్గమని అన్నారు. రాయితీ విద్యుత్తు చార్జీలను డిస్కంలకు ముందుగానే చెల్లించాలనే కేంద్రం నూతన విధానంపై ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్తు అందించడం కేంద్రానికి కంటగింపుగా మారిందని విమర్శించారు.
కేసీఆర్ ఉన్నంత వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఆగదని అన్నారు. అన్నం పెట్టే రైతుకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడం కోసమే సబ్సిడీలు ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్‌పరం చేయడం కోసం కేంద్రం ఎత్తులు వేస్తున్నదని విమర్శించారు. రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఉచితమని కేంద్రం భావించడం అవివేకమన్నారు. ఒకరిద్దరు సంపన్నుల కోసం కోట్లాది మంది ప్రజలను దారిద్య్రంలోకి నెట్టే కేంద్ర ప్రభుత్వ తీరును కేసీఆర్ నాయకత్వంలో ఎండగడుతామని హెచ్చరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే దుర్మార్గమైన ఆలోచనకు తాము పూర్తి వ్యతిరేకమని మంత్రి తేల్చిచెప్పారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోం..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో? ఏ పార్టీ గురించి మాట్లాడుతారో? వారికే తెలియదని అన్నారు. ఒకరు కాంగ్రెస్‌లో ఉండి బీజేపీకి ఓటు వేయాలని, మరొకరు బీజేపీలో ఉండి కాంగ్రెస్‌ను గెలిపించాలని అంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న బ్రదర్ బీజేపీ గెలుస్తుందని.. బీజేపీలో ఉన్న బ్రదర్ కాంగ్రెస్ గెలుస్తుందని మాట్లాడుతూ ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలను అయోమయ పరిస్థితిలోకి నెట్టేసి నవ్వుల పాలవుతున్నారని పేర్కొన్నారు. అందుకే వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.