హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 12 మందిలో కేంద్రం పది మందికి ఆమోదం తెలిపింది. ఆ పది మంది పేర్లను ఆమోదం కోసం రాష్ట్రపతికి నివేదించింది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం తెలుపనుండగా, ఈ నెల 23న కొత్త న్యాయమూర్తులు హైకోర్టు ఆవరణలో ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. కొత్తగా నియమితులైన జడ్జీలలో ఐదుగురు న్యాయాధికారులు కాగా, ఐదుగురు న్యాయవాదులు ఉన్నారు. ఈ పదిమందిలో నలుగురు మహిళలు కావటం విశేషం. దీంతో రాష్ట్ర హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పదికి (మూడోవంతు) చేరనుంది. తెలంగాణ హైకోర్టు చరిత్రలో ఒకేసారి 10 మంది జడ్జీలు నియమితులు కావడం ఇదే మొదటిసారి. హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి పొందిన న్యాయాధికారుల్లో వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జీ అనుపమ చక్రవర్తి, కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జి ఎంజీ ప్రియదర్శిని, హైదరాబాద్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి సాంబశివనాయుడు, న్యాయశాఖ కార్యదర్శి ఏ సంతోష్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ డీ నాగార్జున ఉన్నారు. జడ్జీలుగా నియమితులైన న్యాయవాదుల్లో కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి (కుచడి శ్రీదేవి), నాచరాజు వెంకట శ్రవణ్‌కుమార్ ఉన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఒకటి రెండు రోజుల్లో ఆమోదం తెలుపవచ్చునని న్యాయవర్గాల సమాచారం. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆ తరువాత బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ వారితో ప్రమాణం చేయించనున్నారని హైకోర్టు రిజిస్ట్రార్ (మేనేజ్మెంట్) వీ రమేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం 12 మంది పేర్లను గతంలో కేంద్రానికి సిఫారసుచేసింది. వీరిలో ఇద్దరు న్యాయవాదులు చాడ విజయ భాసర్‌రెడ్డి, మీర్జా సైఫీయుల్లా బేగ్ పేర్లను కేంద్రం ఆమోదించలేదు. వీరిలో ఒకరి వయసు చాలా తకువ కావడం ఒక కారణమని చెప్తున్నారు. హైకోర్టులో ప్రస్తుతం సీజేతో కలిపి 19మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్తవారి రాకతో ఈ సంఖ్య 29కి పెరుగనుంది. రాష్ట్ర హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ఇటీవలే 32 నుంచి 42కి పెంచుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. కాగా, ఇంకా 13 పోస్టులు ఖాళీగా ఉంటాయి.