హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మూగజీవుల రోదనలకు చలించిపోయి, పచ్చని అడివమ్మ ఒడిలో నెత్తురు పారుతుంటే చూస్తు ఊరుకోలేమంటూ.. హెచ్‌సీయూ భూములను రక్షించాలంటూ సినీ ప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షనేతలు ఒక్కటిగా సంఘటితమై పిడికిలి బిగించారు. హెచ్‌సీయూ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సామాజిక మాధ్యమాల్లో మద్దతు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్‌తో ‘సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’ అంటూ రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తున్నారు.
‘ఎంతైనా జాతీయ పార్టీకదా.. అందుకేనేమో జాతీయ పక్షి ఉసురు తీసుకుంటుంది. జాతీయ పక్షుల ఆర్థనాదాలు వింటుంటే గుండె తరుక్కుపోతున్నది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఈ విధ్వంసాన్ని మేము అంగీకరించం. విద్యార్థులు, ప్రజలు చేస్తున్న ఈ పోరాటానికి నా పూర్తి మద్దతు. ఆక్షిజన్ వేలం వేస్తున్నారు’ అంటూ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో మండిపడ్డారు. ‘ఈ చర్య ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.. రాహుల్ వెంటనే తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి’ అంటూ ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్రాథీ పోస్టు చేశారు. హెచ్‌సీయూ భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.