భద్రాచలం, మార్చి 18: ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఉత్సవమూర్తులకు వెండి కలశాలతో అభిషేక తిరుమంజనం, యాగశాలలో మహా పూర్ణాహుతి, మహాకుంభ ప్రోక్షణ జరిపారు. స్వామివారిని ఊయలలో ఉంచి ఆస్థాన హరిదాసులు జోల పాడారు. కీర్తనలు ఆలపించారు. ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి ద్రావిడ పాశురాలను పఠించారు. అర్చకులు వసంతుడిని ఆవాహన చేసి స్వామివారిపై గులాల్, అత్తరు, బుక్కా చల్లారు. రామయ్య శిరస్సు, అమ్మవారి మంగళసూత్రం,లక్ష్మణస్వామి వక్షస్థలంపై పసుపు ముద్దలు ఉంచారు. ఈ ఘట్టంతో సీతారాము లు వధూవరులైనట్టు ఆలయ అర్చకులు భావిస్తారు.
ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఆలయ ఈవో బానోత్ శివాజీ ఆధ్వర్యంలో నవమి తలంబ్రాలు కలిపే వేడుకను నిర్వహించారు. అర్చకులు రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేశారు. రోకలికి కంకణ ధారణ చేశారు. అనంతరం తొమ్మిది మంది వైష్ణవ ముత్తయిదువులు పసుపు కొమ్ములు దంచారు. గులాల్, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యి, సెంట్, పసుపు, కుంకుమతో 1,108 మంది మహిళలు తలంబ్రాలు కలిపారు. అర్చకులు ఈ తలంబ్రాలను శిరస్సుపై ధరించి మూలమూర్తుల వద్దకు తీసుకెళ్లారు. వాటిని ధ్రువమూర్తులకు చూపుతూ భాండాగారంలో భద్రపరిచారు. ఇదే పర్ణశాలలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవ వేడుకలు జరిగాయి.