హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిందని , నిబంధనలను తుంగలో తొక్కిందని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) స్పష్టంచేసింది. కంచ గచ్చిబౌలి భూములపై అధ్యయనం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఈసీ ఇటీవల రాష్ట్రంలో పర్యటించింది. గురువారం సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. కంచ గచ్చిబౌలి మొత్తం విస్తీర్ణం 409.12 ఎకరాలు కాగా.. ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి మొత్తం 104.95 ఎకరాల్లో చెట్ల నరికివేతకు పాల్పడినట్టు చెప్పింది. ఇందులో 71 ఎకరాల్లో అడవి విస్తరించి ఉండేదని, దీనిని ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించినట్టు సీఈసీ తెలిపింది. ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలో కేవలం అడవిని నాశనం చేయలేదని, ప్రజల నమ్మకాన్ని, రాజ్యాంగబద్ధ విధులను, సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించిందని అభిప్రాయపడింది.
కంచ గచ్చిబౌలి భూముల్లో అద్భుతమైన జీవావరణ వ్యవస్థ ఉన్నదని సీఈసీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 104 ఎకరాల్లో అడవులను ధ్వంసం చేయడంతో అక్కడి జీవావరణ వ్యవస్థకు, జంతుజాతికి పూడ్చలేని నష్టం వాటిల్లినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర అటవీ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కాంట్రాక్టర్ 104 ఎకరాల్లోని 1,399 అనుమతి పొందిన చెట్లను, 125 అనుమతి లేని చెట్లను నరికివేసినట్టు చెప్పింది. ఆర్టికల్ 48ఏ, ఆర్టికల్ 21 ప్రకారం ప్రభుత్వ ములు, వనరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని గుర్తు చేస్తూ.. కంచ గచ్చిబౌలిలో ఆ బాధ్యతల్లో విఫలం కావడం నేరంతో సమానమని అభిప్రాయపడింది.
మరోవైపు రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని ప్రభుత్వం నిరుడు ఏప్రిల్‌లో కేంద్ర పర్యావరణ శాఖకు సమాచారం ఇచ్చింది. రెండు నెలల్లోనే ఆ నివేదికను ఉపసంహరించుకున్నది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించుకుంటున్నట్టు సీఈసీ తన నివేదికలో పేర్కొన్నది. దీంతో అటవీ భూముల లెక్కలను తారుమారు చేసేందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో నియమించిన కమిటీలో నిపుణులు లేరని సీఈసీ అభిప్రాయపడింది. కమిటీని పునర్నియమించాలని సూచించింది. భూములను రక్షించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొన్నట్టు తెలిపింది.
1.ఈ భూమిని తక్షణమే అరణ్యంగా ప్రకటించి, రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
2.104.95 ఎకరాల్లో భారీగా మొక్కలు పెంచి పూర్వ స్థితికి తీసుకురావాలి.
3.జీవావరణం, అరుదైన వృక్ష, జంతుజాతి వంటివాటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలి.
4.ఈ ప్రాంతంలోని జలాశయాలను సంరక్షించాలి.
5.ఈ ప్రాంతంలోకి మురుగునీరు రాకుండా ఏడాదిలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
6.అటవీ పరిరక్షణ కమిటీని పునర్నిర్మించాలి. శాస్త్రవేత్తలు, రిమోట్ సెన్సింగ్ నిపుణులను కమిటీలో చేర్చాలి.
7.రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో అటవీ తరహా ప్రాంతాలను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని నియమించాలి.
8.ఈ నివేదిక తయారు చేయడానికి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు రూ.14.52 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలి.