హైదరాబాద్, అక్టోబరు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు కృషిచేయాలని కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన రెండోరోజు బుధవారం హోటల్ తాజ్‌కృష్ణాలో సీఈవో వికాస్‌రాజ్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల నిర్వహణపై సూచనలు, ఆదేశాలు, సలహాలు ఇచ్చారు.
ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ కఠినంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను అనుగుణంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీలు, ఓటర్లలో నమ్మకాన్ని పెంచేవిధంగా ఎన్నికల ఏర్పాట్లు, నిబంధనలు అమలుచేయాలని సూచించారు. సమీక్షలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్‌గోయల్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సీఎస్, డీజీపీతో భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడోరోజు గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎన్నికల సంఘానికి కావాల్సిన సహకారం, సౌకర్యాలు, యంత్రాంగంపై సమీక్షిస్తారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో సీఈసీ పర్యటన ముగియనున్నది. అంతకుముందు ఉదయం 9.15 గంటలకు గచ్చిబౌలిలోని టెక్‌మహేంద్ర ఆడిటోరియంలో ఓటర్ల అవగాహన, చైతన్యంపై నిర్వహించే కార్యక్రమంలో సీఈసీ రాజీవ్‌కుమార్, సీఈవో వికాస్‌రాజ్ పాల్గొంటారు.