సుబేదారి, మే 9: తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరుపాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తమ నుంచి ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తున్నామని మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక లేఖ విడుదల చేశారు. లేఖలోని సారాంశం ఇలా.. ‘కొంత కాలంగా మా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరుపాలని తొలుత తెలుగు రాష్ర్టాల్లో డిమాండ్ మొదలైంది.
ఇందులో భాగంగా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు, వ్యక్తులు, ప్రముఖులు, రాజకీయ పార్టీల వారు ఇదే విషయమై డిమాండ్ చేస్తున్నారు. కగార్ ఆపరేషన్ రద్దు చేయాలని సీపీఐ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అం తర్గత సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. శాంతి చర్చ లు జరుపాలని బీఆర్ఎస్ రజతోత్సవ సభ లో తీర్మానం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత, సీఎం రేవంత్‌రెడ్డి శాంతి చర్చలు జరుపాలని డిమాండ్ చేయడం హర్షణీయం’ అని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్ని వామపక్ష పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు శాంతి చర్చలకు డిమాండ్ చేస్తున్నాయని, చర్చల ప్రక్రియ రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామిక వా తావారణాన్ని తీసుకొచ్చే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలి సూచించారు. దీనికి సానుకూలతను కల్పించేందుకు తమ నుంచి కాల్పు ల విరమణ ప్రకటిస్తున్నామని జగన్ తెలిపారు.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 9 : వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 38 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారులు ఆదివాసీల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యకలాపాలు, ఆపరేషన్ ‘చేయుత’కి ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన 38 మందిలో.. ఇద్దరు పార్టీ సభ్యులు, 16 మంది మిలీషియా సభ్యులు, ఏడుగురు వీసీఎంలు, ఆరుగురు కేఏఎంఎస్ సభ్యులు, ముగ్గురు చైతన్య నాట్యమండలి సభ్యులు, నలుగురు గ్రామ రక్షక దళ సభ్యులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయార్థం నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్టు పేర్కొన్నారు.