హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాల్పుల విరమణను మరో 6 నెలలపాటు కొనసాగించనున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖను విడుదల చేశారు. కాల్పులు విరమణ చేసిన ఈ ఆరు నెలల్లో అనుకున్న పద్ధతులు అమలుచేసి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పోరాడాలని లేఖ ద్వారా జగన్ కోరారు.