సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌ను సినీ ఫక్కీలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సుధాకర్.. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు పెట్టగా వెంబడించి మరీ అరెస్టు చేశారు.
వివాదంలో ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వడానికి బాధితుడి నుంచి సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు మొదటి విడతలో రూ.5 లక్షలు చెల్లించాడు. రెండో విడతలో భాగంగా గురువారం రూ.3లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో బాధితుడు రూ.3 లక్షలను ఇచ్చాడు. ఆ డబ్బును అందుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏసీబీ అధికారులను గుర్తించిన సుధాకర్ డబ్బుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో సినీ ఫక్కీలో వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.