హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాలుగు శతాబ్దాల నాటి గోండ్వానా కాలం జీవరాశులను సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. అతి ప్రాచీన భౌగోళిక నేపథ్యం ఉన్న గోండ్వానా కాలం నాటి భారతీయ ద్వీపకల్పంపై ప్రత్యేక దృష్టి సారించిన పరిశోధకులు నాటి జీవభౌగోళిక చరిత్రను అంచనా వేశారు. ఖండాంతర వైకారి మూలాలు ఆసియా, ఆస్ట్రేలియాతోపాటు భారత్లోని పలు ప్రాంతాల్లో ఉన్నట్టు తేల్చారు. ఈ క్రమంలో మాలిక్యూలార్ డాటా పరిశీలించి పాకెడు పురుగు ‘జెర్రి’కి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని సీసీఎంబీకి చెందిన జాన్వి జోషీ పరిశోధన బృందం తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నది. ఇందుకోసం ఆ బృందం పశ్చిమ కనుమల్లోని పలు కొండప్రాంతాల్లో ఏడాది కాలంగా సంచరిస్తూ పరిశోధన సాగిస్తున్నది. ఈ క్రమంలోనే 400 ఏళ్ల నాటి జెర్రి మూలాలను కనుగొన్నట్టు వెల్లడించింది. జీవ వైవిధ్యం, పురాతన వైవిధ్యం గోండ్వానా అవశేషాలను సూచిస్తున్నాయని, అండమాన్ దీవుల నుంచి 11 పుటేటివ్ జాతుల ఆవిష్కరణ ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నదని తెలిపింది.