హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించండి’ అంటూ సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీఅయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 నెలలుగా ఇలాంటి ఆదేశాలు తరచూ జారీ కావడం రివాజుగా మారింది. గత మార్చిలో పెండింగ్ దరఖాస్తులకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ధరణిలో పెండింగ్ దరఖాస్తులు రెండు లక్షల వరకు ఉన్నాయని, వాటిని 9 రోజుల్లో పరిష్కరిస్తామంటూ ఊదరగొట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధికోసం మరో రెండు వారాలపాటు హడావుడి చేసింది. ఆ తర్వాత ప్రక్రియను పక్కన పడేసింది. దీంతో ఎన్నికల సమయంలో మరో లక్ష దరఖాస్తులు వచ్చాయని, పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 3.10 లక్షలకు పెరిగిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. విమర్శలు వెల్లువెత్తడంతో మళ్లీ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
నీటి పారుదలశాఖలో ఎక్స్టెన్షన్లు వద్దు
హైదరాబాద్, నవంబర్28 (నమస్తే తెలంగాణ): నీటి పారుదలశాఖలో ఎక్స్టెన్షన్లను కొనసాగించవద్దని ఇంజినీర్ల సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి పలు సంఘాలు గురువారం ప్రకటనలో విజ్ఞప్తి చేశాయి. అయితే ఇరిగేషన్‌శాఖలో ఇప్పటికే పలువురు ఇంజినీర్లకు ఎక్స్టెన్షన్లను ఇచ్చారని, దానిని మళ్లీ పునరావృతం చేయవద్దని, అది ముఖ్యమంత్రి హామీలకు వ్యతిరేకమని వెల్లడించారు. హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఎన్ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గోపాల్‌కృష్ణ, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సంయుక్తంగా ప్రకటనను విడుదల చేశారు.