హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వ హయాంలో జరిగిన యాదా ద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొనుగోళ్ల విషయంలో మదన్ బీ లోకూర్ విచారణ కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగించేందుకు ఆమోదించినట్టు తెలిపారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కాగా, క్యాబినెట్ నిర్ణయాలను సోమవారం రాత్రి ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్నందున క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని ఇన్చార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చెప్పారని తెలిపారు.
ఎన్డీడీబీకి నార్ముల్ అప్పగింత
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్(నార్ముల్) నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు ఆమోదం తెలుపాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాల్లో సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేస్తామని తెలిపారు. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్ను బకాయిల క్లియర్‌కు ఓటీఎస్ వెసులుబాటు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్, టీశాట్‌ను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు.